చైనా గుప్పిట్లో హాంకాంగ్‌: కివీస్‌ కీలక నిర్ణయం | New Zealand Suspends Extradition Treaty With Hong Kong | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌తో ఒప్పందం రద్దు.. అయితే

Published Tue, Jul 28 2020 11:10 AM | Last Updated on Tue, Jul 28 2020 4:18 PM

New Zealand Suspends Extradition Treaty With Hong Kong - Sakshi

వెల్లింగ్‌టన్‌: ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ విషయంలో న్యూజిలాండ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాంతంతో నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్‌ స్వయంప్రతిపత్తిని కాలరాసేలా చైనా.. అక్కడ జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం వెల్లడించింది.  అయితే ఒకవేళ చైనా భవిష్యత్తులో గనుక తన నిర్ణయాన్ని మార్చుకుని.. ‘‘ఒక దేశం- రెండు వ్యవస్థలు’’ విధానానికి కట్టుబడి ఉంటే ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

ఈ విషయం గురించి న్యూజిలాండ్‌ విదేశీ వ్యవహారాల మంత్రి విన్‌స్టన్‌ పీటర్స్‌ మాట్లాడుతూ.. చైనా గుప్పిట్లోకి వెళ్లిన హాంకాంగ్‌ నేర, న్యాయ వ్యవస్థపై తాము విశ్వాసం కోల్పోయామని.. అందుకే నేరస్తుల అప్పగింత ఒప్పందం నుంచి వైదొలగినట్లు తెలిపారు. హాంకాంగ్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో అక్కడికి వెళ్లే తమ దేశ ప్రయాణికులను ఇప్పటికే అప్రమత్తం చేశామని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌- హాంకాంగ్‌ పరస్పర ఒప్పందాల విషయంలో డ్రాగన్‌ పరోక్ష ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా కరోనా వ్యాప్తి, హాంకాంగ్‌ పట్ల చైనా వైఖరిపై అమెరికా సహా యూకే తదితర దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. (చైనాపై కఠిన చర్యలకు సిద్ధమైన అమెరికా!)

యూకే, కెనడా, ఆసీస్‌ బాటలో
ఈ నేపథ్యంలో హాంకాంగ్‌పై చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ.. అగ్రరాజ్యం అమెరికా హాంకాంగ్‌కు కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించింది. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత  ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలను రద్దు చేసుకునేందుకు సమాయత్తమైంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, యూకే, కెనడా హాంకాంగ్‌తో ఇప్పటికే నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని రద్దు చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్‌​ సైతం ఇదే బాటలో నడిచింది.

ఇక కివీస్‌కు చైనా కీలక వ్యాపార భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఏడాదికి 21 బిలియన్‌ డాలర్ల మేర వాణిజ్య, వ్యాపార లావాదేవీలు సాగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తైవాన్‌కు న్యూజిలాండ్‌ మద్దతుగా నిలవడంతో కివీస్‌- డ్రాగన్‌ల మధ్య బంధం బలహీనపడింది. కాగా తైవాన్‌పై ఆధిపత్యం కోసం చైనా విశ్వప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.  (.తైవాన్‌ డబ్ల్యూహెచ్‌ఓపై విషం కక్కుతోంది: చైనా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement