కఠ్మాండూ: నేపాల్ విమాన సేవలకు కఠ్మాండూ విషాదం సెగ తగిలింది. నేపాల్ రాజధాని కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా ఢాకా నుంచి కఠ్మాండూ వెళ్లే విమానాల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నుట్లు యూఎస్- బంగ్లా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ‘ఆ విషాదానికి సంబంధించి పైలట్‌కు ఐటీసీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్లాయని మాత్రమే తెలుసు. ఇది తప్ప మా దగ్గర ఎటువంటి అదనపు సమాచారం లేదని, ఈ విషయమై తమకెవరిపై అనుమానాలు లేవని’ యూఎస్- బంగ్లా ఎయిర్‌లైన్స్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం చేపట్టిన విచారణకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ఇలాంటి ప్రమాదాలు సంభవించినపుడు సమాచార లోపం ఉండకూడదనే ఉద్దేశంతోనే ఢాకాలో అత్యవసర స్పందన కేంద్రాన్ని ఏర్పాటు చేశామని స్పష్టం చేసింది.
మరోవైపు పైలట్‌కు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు మధ్య సమాచార లోపం వల్లే ప్రమాదం సంభవించిందనే అనుమానాలు భారీగా నెలకొన్నాయి అటు ఈ అంశంపై విచారణ జరిపేందుకు నేపాల్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కాగా విమాన ప్రమాదంలో గాయపడిన నేపాలీ, బంగ్లాదేశ్ ప్రయాణికులు కఠ్మాండూలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కఠ్మాండూ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం జరిగిన ప్రమాదంలో 50 మంది ప్రయాణికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment