
అమెరికాలో కుప్పకూలిన విమానం
నెవెడా: అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఉత్తర నెవెడాలో ఎయిర్ అంబులెన్స్ విమానం కూలిపోవడంతో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న రోగిని ఉతాహ్ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానం కాసినో సమీపంలోని ప్రైవేటు మైనింగ్ కంపెనీకి చెందిన పార్కింగ్ ప్రదేశంలో కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రోగితో పాటు విమానంలో ఉన్న ముగ్గురు సిబ్బంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నారు.
సాంకేతిక లోపం కారణంగానే విమానం కూలిపోయివుంటుందని అనుమానిస్తున్నారు. ఈ విమానం రెనోకు చెందిన అమెరికన్ మిడ్ ఫ్లైట్ సంస్థకు చెందినది. ప్రమాదంపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తామని మిడ్ ఫ్లైట్ సంస్థ తెలిపింది. అయితే మృతుల పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.