
మహాత్మా గాంధీ విగ్రహం (ఫైల్ ఫొటో)
లండన్: భారత స్వాతంత్ర్యం కోసం ఏ దేశ పాలకులకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ పోరాడారో, ఆ దేశ పార్లమెంటు ఆవరణలోనే మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. బ్రిటిష్ పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరాన్ మద్దతు పలికారు. విన్‌స్టన్ చర్చిల్, నెల్సన్ మండేలా విగ్రహాల సరసన భారత జాతిపిత విగ్రహం ఏర్పాటుచేయడం సరైన నిర్ణయమే అన్నారు. శాంతి, అహింసల గొప్పతనాన్ని ప్రపంచానికి బోధించిన మహోన్నత వ్యక్తి గాంధీ అని కొనియాడారు. దీంతో బ్రిటన్‌కు భారత్‌తోఉన్న చారిత్రక సంబంధాలు మరింత ధృడపడతాయని పేర్కొన్నారు. శక్తిమంతమైన సమాజాన్ని నిర్మించాలనుకునేవారికి మహాత్ముని బోధనలు మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు.
ఈ ఏడాది ప్రథమార్ధంలోనే గాంధీ విగ్రహన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కామెరాన్ తెలిపారు. గత ఏడాది యూకే ప్రతినిధి బృందం భారత పర్యటన సందర్భంగా విగ్రహ ఏర్పాటు విషయాన్ని ప్రకటించారు. ప్రవాస భారతీయ ఆర్థిక వేత్త లార్డ్ మేఘనాథ్ దేశాయ్ నేతత్వంలోని 'గాంధీ స్టాట్యూ మెమోరియల్ ట్రస్ట్' ఈ విగ్రహానికి నిధులు సమీకరిస్తోంది, విగ్రహ ఏర్పాటుకు 7 లక్షల 50 వేల పౌండ్లు అవసరమని భావించగా, మూడు నెలల స్వల్ప వ్యవధిలోనే 5 లక్షల పౌండ్లు సమీకరించినట్లు ట్రస్ట్ వర్గాలు తెలిపాయి.