
గాంధీజీ బతికుంటే కన్నీళ్లు పెట్టేవారు: ఒబామా
మహాత్మా గాంధీ బతికుంటే.. భారతదేశంలో ప్రస్తుతమున్న పరమత అసహనాన్ని చూసి దిగ్భ్రాంతికి గురయ్యేవారని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా ఇటీవల భారత పర్యటన ముగింపు సమయంలో సిరిఫోర్ట్ ఆడిటోరియంలో మాట్లాడుతూ మత సహనం గురించి ప్రస్తావించటం అధికార బీజేపీపై విమర్శేనన్న వాదనను శ్వేతసౌధం ఖండించింది.
కాగా, తాజాగా వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఒబామా మాట్లాడుతూ.. ''మిషెల్, నేను భారత్ నుంచి తిరిగివచ్చాం. అది అద్భుతమైన, అందమైన దేశం. ఘనమైన భిన్నత్వమున్న దేశం. కానీ.. అక్కడ గత కొన్నేళ్లుగా అన్ని రకాల మత విశ్వాసాల వాళ్లపై దాడులు జరుగుతున్నాయి. కేవలం తమ సాంస్కృతిక వారసత్వం, నమ్మకాలను బలపరుచుకోవాలనే ఇలా చేస్తున్నారు. ఈ అసహన చర్యలు.. ఆ జాతిని విముక్తం చేసేందుకు దోహదపడిన గాంధీజీని దిగ్భ్రాంతికి గురిచేసి ఉండేవి'' అని పేర్కొన్నారు.
దాదాపు 3,000 మంది అమెరికా, అంతర్జాతీయ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో ఒబామా మాట్లాడుతూ.. హింస అనేది ఒక బందానికో, ఒక ప్రాంతానికో ప్రత్యేకం కాదని.. ఈ (మత అసహనం) సమస్యలతో మానవజాతి తన చరిత్ర అంతటా పోరాడుతూనే ఉందని వ్యాఖ్యానించారు.