రాజన్ ఆస్తుల విలువ.. ఎంతో తెలుసా!
మాఫియా డాన్ ఛోటా రాజన్ ఏ మాత్రం ఆస్తులు సంపాదించి ఉంటాడో అంచనా వేయగలరా? దాదాపు 4-5 వేల కోట్ల పైమాటేనట. ఈ విషయాన్ని ముంబై పోలీసు అధికారులు చెబుతున్నారు. అతడి పెట్టుబడుల్లో సగానికి పైగా భారతదేశంలోను, అందునా ముంబై నగరం, శివార్లలోనే ఉన్నాయి. చైనాలో ఓ హోటల్, సింగపూర్, థాయ్‌లాండ్‌లలో కొన్ని నగల దుకాణాలు, జకార్తాలో ఓ హోటల్ కూడా ఉన్నాయట. ఆఫ్రికన్ దేశాల్లో, ముఖ్యంగా జింబాబ్వేలో వజ్రాల వ్యాపారాల్లోనూ ఇతడికి భాగం ఉంది.
అందుకే జింబాబ్వే వెళ్లి, అక్కడి అధికారుల సాయంతో ఆశ్రయం పొందుదామని ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ, భారతదేశానికి బాగా అవసరమైన వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడానికి జింబాబ్వే సిద్ధంగా లేదు. భారత్‌లో కావాలంటే మంచి వైద్యం అందిస్తామని, అంతేతప్ప జడ్ ప్లస్ లాంటి సెక్యూరిటీ మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని భారత అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. తనపై దావూద్ గ్యాంగ్ దాడిచేసే అవకాశాలు ఉన్నాయన్నది రాజన్ అనుమానం. ప్రస్తుతం కిడ్నీ వ్యాధి కారణంగా డయాలసిస్ చేయించుకుంటున్నందున గట్టిగా ఎదురుదాడి చేసే పరిస్థితుల్లో రాజన్ లేడు. అందుకే ఎలాగోలా జింబాబ్వే పారిపోవాలని ప్రయత్నించినట్లు ఇండోనేషియా పోలీసులు కూడా చెబుతున్నారు.
ఇక భారతదేశంలో ఛోటా రాజన్‌పై దాదాపు 75 కేసులు నమోదయ్యాయి. అందులో సుమారు 25 హత్య కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అత్యంత కఠినమైన 'మోకా' చట్టం కింద పెట్టినవే. దీంతో ఒక్కసారి తమ చేతికి చిక్కితే కనీసం మూడేళ్ల పాటు కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉందన్నది భారత పోలీసుల నమ్మకం.