mumbai mafia
-
ఆలియా @ ప్రెసిడెంట్ ఆఫ్ కామాటిపురా
‘‘కామాటిపురాలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగు ఉంటుంది. గౌరవంతో బతకాలి.. ఎవ్వరికీ భయపడకూడదు. నేను గంగూ బాయి.. ప్రెసిడెంట్ కామాటిపురా. మీరు కుమారి అంటూనే ఉన్నారు... నన్ను ఎవరూ శ్రీమతిని చేసిందే లేదు’’ వంటి డైలాగ్స్ ‘గంగూబాయి కాఠియావాడీ’ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కాఠియావాడీ’. జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వేశ్యా గృహం నడిపే యజమాని గంగూబాయిగా నటిస్తున్నారు ఆలియా భట్. కాగా ‘వకీల్ సాబ్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ‘గంగూబాయి కాఠియావాడీ’ తెలుగు టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగారు? అనేదే సినిమా ప్రధానాంశం. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ‘గంగూబాయి కాఠియావాడీ’ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
లాఠీ లాక్కుని.. కానిస్టేబుళ్లనే కొట్టి!
(వెబ్సైట్ ప్రత్యేకం) అది ముంబై చెంబూరు ప్రాంతంలోని సహకార్ థియేటర్. 1979వ సంవత్సరం.. కొంతమంది కుర్రాళ్లు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. నగరవ్యాప్తంగా బ్లాక్ టికెట్ల దందా మీద విరుచుకుపడుతున్న ముంబై పోలీసులు.. సహకార్ థియేటర్ వద్ద కూడా లాఠీలు విదిలించారు. అంతలో అక్కడ బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లలో ఓ కుర్రాడు వచ్చి, ఓ కానిస్టేబుల్ వద్ద లాఠీ లాక్కుని ఐదుగురు పోలీసులను బాగా కొట్టాడు. వాళ్లలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి కూడా. ఆ ఒక్క సంఘటనతో ముంబైలోని గ్యాంగుల కళ్లు ఆ కుర్రాడి మీద పడ్డాయి. అతడి పేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్జే. చాలామంది పిలిచినా అతడు మాత్రం రాజన్ నాయర్ అనే మాఫియా డాన్ గ్యాంగులోకే వెళ్లాడు. రాజన్ నాయర్‌ను అంతా బడా నాయర్ అని పిలిచేవాళ్లు. తమిళనాడు నుంచి ముంబై వెళ్లిన బడా నాయర్.. తొలిరోజుల్లో టైప్ రైటర్లు దొంగతనం చేసేవాడు. ఓసారి పోలీసులు చోర్‌బజార్‌లో అతడిని అరెస్టు చేసి రకరకాల కేసులు పెట్టి మూడేళ్ల పాటు జైల్లో ఉంచడంతో.. జైలే నాయర్‌ను మాఫియా డాన్‌గా మార్చింది. బడా నాయర్‌కు మొదట్లో నమ్మకస్తుడిగా ఉండే కుంజు అహ్మద్ అనే వ్యక్తి అతడిని మోసం చేసి, వేరే గ్యాంగు పెట్టుకోవడమే కాక.. నాయర్ ఎంతగానో ప్రేమించిన యువతిని ఎత్తుకెళ్లిపోయాడు. ఆ తర్వాత రాజేంద్ర నిఖల్జే ఈ గ్యాంగులో చేరి.. నాయర్‌కు బాగా నమ్మకస్తుడిగా మారాడు. ఎత్తు కూడా తక్కువగా ఉండటంతో అందరూ అతడిని ఛోటా రాజన్ అని పిలిచేవాళ్లు. కొన్నాళ్ల తర్వాత కుంజు చేతిలో బడా రాజన్ హత్యకు గురయ్యాడు. దాంతో ఛోటారాజన్ ఆదేశాల మేరకు ముంబైలో బంద్ పాటించారు. అప్పటికి శివసేన లాంటి పార్టీలు కూడా ఇంకా బంద్ పిలుపు ఇచ్చేవి కావు. బంద్ విజయవంతం కావడంతో ఛోటా రాజన్ పేరు మాఫియా వర్గాల్లో కూడా అందరికీ బాగా తెలిసింది. తర్వాత కుంజును హతమార్చేందుకు అతడు వేసిన ప్లాన్లు, వాటిని అమలుచేసిన తీరు.. ఇవన్నీ దావూద్ ఇబ్రహీం దృష్టిని ఆకట్టుకున్నాయి. దాంతో ఛోటా రాజన్‌కు దావూద్ అడ్డా అయిన 'ముసాఫిర్ఖానా' నుంచి పిలుపు వచ్చింది. దావూద్ గ్యాంగ్ నుంచి ఆహ్వానం అందడమంటే చిన్న విషయం కాదు కాబట్టి వెంటనే మారు మాట్లాడకుండా వెళ్లి చేరిపోయాడు. దావూద్ అండదండలకు తోడు తన తెలివితేటలతో కుంజును అతడి సొంత ప్రాంతంలోనే హతమార్చాడు ఛోటా రాజన్. అప్పటి నుంచి దావూద్‌కు నమ్మకస్తుడైన అనుచరుడిగా మారిపోయాడు. ఆ గ్యాంగులో ప్రముఖుడిగా కూడా ఎదిగాడు. కానీ తర్వాతి కాలంలో దావూద్‌తో విభేదాలు తలెత్తి, వేరే సొంత గ్యాంగు పెట్టుకోవడమే కాక.. దావూద్ మనుషులను చంపించడంలో కూడా ముందడుగు వేశాడు. 27 ఏళ్ల క్రితం దేశం విడిచి పారిపోయి వివిధ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తూనే ముంబైలో తన మాఫియా సామ్రాజ్యాన్ని కూడా నడిపించాడు. దావూద్ మనుషులను హతమార్చడంతో దేశభక్త డాన్ అనే ముద్ర కూడా సంపాదించాడు. చివరకు ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారంతో ఇంటర్‌పోల్ వర్గాలు బాలిలో అరెస్టు చేయడంతో ఇన్నాళ్లకు మళ్లీ ఢిల్లీ చేరుకున్నాడు. -కామేశ్వరరావు పువ్వాడ -
రాజన్ ఆస్తుల విలువ.. ఎంతో తెలుసా!
మాఫియా డాన్ ఛోటా రాజన్ ఏ మాత్రం ఆస్తులు సంపాదించి ఉంటాడో అంచనా వేయగలరా? దాదాపు 4-5 వేల కోట్ల పైమాటేనట. ఈ విషయాన్ని ముంబై పోలీసు అధికారులు చెబుతున్నారు. అతడి పెట్టుబడుల్లో సగానికి పైగా భారతదేశంలోను, అందునా ముంబై నగరం, శివార్లలోనే ఉన్నాయి. చైనాలో ఓ హోటల్, సింగపూర్, థాయ్‌లాండ్‌లలో కొన్ని నగల దుకాణాలు, జకార్తాలో ఓ హోటల్ కూడా ఉన్నాయట. ఆఫ్రికన్ దేశాల్లో, ముఖ్యంగా జింబాబ్వేలో వజ్రాల వ్యాపారాల్లోనూ ఇతడికి భాగం ఉంది. అందుకే జింబాబ్వే వెళ్లి, అక్కడి అధికారుల సాయంతో ఆశ్రయం పొందుదామని ప్రయత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ, భారతదేశానికి బాగా అవసరమైన వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడానికి జింబాబ్వే సిద్ధంగా లేదు. భారత్‌లో కావాలంటే మంచి వైద్యం అందిస్తామని, అంతేతప్ప జడ్ ప్లస్ లాంటి సెక్యూరిటీ మాత్రం ఇచ్చే ప్రసక్తి లేదని భారత అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. తనపై దావూద్ గ్యాంగ్ దాడిచేసే అవకాశాలు ఉన్నాయన్నది రాజన్ అనుమానం. ప్రస్తుతం కిడ్నీ వ్యాధి కారణంగా డయాలసిస్ చేయించుకుంటున్నందున గట్టిగా ఎదురుదాడి చేసే పరిస్థితుల్లో రాజన్ లేడు. అందుకే ఎలాగోలా జింబాబ్వే పారిపోవాలని ప్రయత్నించినట్లు ఇండోనేషియా పోలీసులు కూడా చెబుతున్నారు. ఇక భారతదేశంలో ఛోటా రాజన్‌పై దాదాపు 75 కేసులు నమోదయ్యాయి. అందులో సుమారు 25 హత్య కేసులు ఉన్నాయి. వీటిలో చాలా వరకు అత్యంత కఠినమైన 'మోకా' చట్టం కింద పెట్టినవే. దీంతో ఒక్కసారి తమ చేతికి చిక్కితే కనీసం మూడేళ్ల పాటు కస్టడీలో ఉంచుకునే అవకాశం ఉందన్నది భారత పోలీసుల నమ్మకం. -
ఛోటా రాజన్‌ను పట్టించింది నేనే
నేర సామ్రాజ్యాన్ని తనదైన శైలిలో ఏలిన ఛోటా రాజన్ ఇంతకీ ఎలా పట్టుబడ్డాడో తెలుసా.. అతడి బద్ధశత్రువు, మరో మాఫియా నాయకుడు షకీల్ షేక్.. అలియాస్ ఛోటా షకీలే పట్టించాడట. నిజానికి 15 ఏళ్ల క్రితమే ఛోటా రాజన్‌ను బ్యాంకాక్‌లో చంపించేందుకు షకీల్ ప్లాన్ వేశాడు. ఇప్పుడు రాజన్ అరెస్టు తనకేమంత సంతోషంగా అనిపించట్లేదని చెప్పాడు. గత వారంలో కూడా తన మనుషులు ఫిజీలో ఛోటా రాజన్‌ను చంపేందుకు ప్రయత్నించారని, అతడు ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడో అన్నీ తమకు తెలుసని ఛోటా షకీల్ చెప్పాడు. తర్వాత అతడు ఇండోనేసియాకు పారిపోతున్న విషయం తెలిసి.. అతడిని అరెస్టు చేయించానన్నాడు. డి కంపెనీ కూడా తమ శత్రువు అరెస్టును జీర్ణించుకోలేకపోతోంది. తమ శత్రుత్వం ఇక్కడితో ముగిసిపోయేది కాదని మాఫియా నాయకులు అంటున్నారు. ఎలాగైనా అతడిని చంపాలనుకుంటున్నానని, అప్పటివరకు విశ్రమించేది లేదని షకీల్ అన్నాడు. అతడిని భారతదేశానికి పంపేసినా కూడా తన ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని తెలిపాడు. తాను భారత ప్రభుత్వాన్ని నమ్మేది లేదని, వాళ్లే ఇన్నాళ్లబట్టి రాజన్‌ను పెంచి పోషించారని, తమమీదకు ఉసిగొల్పారని షకీల్ మండిపడ్డాడు. అసలు భారతదేశంలో అతడి మీద విచారణ జరిగి, శిక్ష పడుతుందన్న నమ్మకం తమకు లేదన్నాడు. శత్రువును ఖతమ్ చేయడమే తమ ఫండా (లక్ష్యం) అని తనదైన శైలిలో షకీల్ చెప్పాడు. అతడు ఎక్కడున్నా క్షమించేది లేదని స్పష్టం చేశాడు. దావూద్ ఇబ్రహీంకు కుడిభుజం లాంటి ఛోటా షకీల్.. ఎప్పటినుంచో రాజన్ కోసం వెతుకుతున్నాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత రాజన్.. దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయాడు. 2000 సెప్టెంబర్ నెలలో రాజన్ మీద బ్యాంకాక్‌లో దాడి చేయించింది ఛోటా షకీలే. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజన్.. ఆస్పత్రిపాలయ్యాడు. ఆ తర్వాత తన అనుచరుల సాయంతో ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ రెండు గ్యాంగుల మధ్య దాదాపు రెండు దశాబ్దాల వైరం ఉంది. అటు ఇటు జరిగిన దాడుల్లో రెండు గ్యాంగులకు చెందిన చాలామంది హతమయ్యారు. వాళ్లలో ముందుగా మరణించింది దావూద్‌కు సన్నిహిత అనుచరుడు శరద్ శెట్టి. ఆ తర్వాత బిల్డర్ ఓపీ కుక్రేజా, ఎయిర్‌లైన్స్ సంస్థ ఎండీ టకీయుద్దీన్ వాహిద్, నేపాల్ ఎమ్మెల్యే మీర్జా బేగ్, అక్కడి కేబుల్ ఆపరేటర్ జమీమ్ షా, పర్వేజ్ తండా.. ఇలా ఒకరి తర్వాత ఒకరు నేలకొరిగారు. ఆ తర్వాత ముంబై పేలుళ్లకు కుట్రపన్నిన వాళ్లు ఒక్కొక్కరిని రాజన్ చంపడం మొదలుపెట్టాడు. సలీమ్ కుర్లా, మజీద్ ఖాన్, మహ్మద్ జింద్రన్.. ఇలాంటి వాళ్లు ఛోటా రాజన్ గ్యాంగు చేతిలో నేలరాలారు. -
షారుక్‌పై ముంబై మాఫియా గురి?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు ముంబైలోని అండర్ వరల్డ్ మాఫియా నుంచి ముప్పు పొంచి ఉందా? షారుక్‌తో మాట్లాడేందుకు రవి పూజారి ప్రయత్నించాడా? సరిగ్గా ఇలాంటి అనుమానాలే ముంబై పోలీసులకు కూడా వచ్చాయి. దాంతో సూపర్‌స్టార్‌కు భద్రత మరింత పటిష్ఠం చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. సోమవారం మధ్యాహ్నమే షారుక్‌తో మాట్లాడేందుకు రవిపూజారి ప్రయత్నించినట్లు సమాచారం. దాంతో ముందు జాగ్రత్త చర్యగా షారుక్ భద్రత పెంచారు. బాలీవుడ్ నిర్మాత అలీ మొరానీ ఇంటివద్ద ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇటీవలే ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. షారుక్ ఖాన్‌కు అలీ మొరానీ చాలా సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి కూడా. కొన్ని రోజుల క్రితమే తనకు పెద్దమొత్తంలో డబ్బులు పంపాలంటూ అలీ మొరానీకి రవి పూజారి నుంచి బెదిరింపు ఫోన్లు వచ్చినా, ఆయన వాటిని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో భయపెట్టేందుకు కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఇప్పుడు ఆయనకు సన్నిహితుడైన షారుక్‌పై కూడా రవిపూజారి కన్ను పడిందని చెబుతున్నారు. షారుక్ ప్రస్తుతం 'హేపీ న్యూ ఇయర్' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. -
నిర్మాత ఇంటిపై మాఫియా కాల్పులు!!
బాలీవుడ్ నిర్మాత, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని అలీ మొరానీ ఇంటిపై ముంబై మాఫియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజుల క్రితమే మొరానీకి అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి డబ్బులు పంపాలని బెదిరిస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఆయన వాటిని అంతగా పట్టించుకోలేదు. దాంతో రవి పూజారి గ్యాంగుకు చెందిన ఇద్దరు షూటర్లు జుహు ప్రాంతంలోని మొరానీ ఇంట్లోకి ప్రవేశించి, ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఎవరినీ చంపాలని గానీ, గాయపరచాలని గానీ ఆ గ్యాంగ్ సభ్యులు రాలేదని, కేవలం బెదిరించాలన్నదే వాళ్ల లక్ష్యంగా ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు కరీం మొరానీ, మహ్మద్ మొరానీల సోదరుడే అలీ మొరానీ. వీళ్లు సినీయుగ్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను నడిపిస్తున్నారు.