లాఠీ లాక్కుని.. కానిస్టేబుళ్లనే కొట్టి! | how chhota rajan started in mumbai mafia | Sakshi
Sakshi News home page

లాఠీ లాక్కుని.. కానిస్టేబుళ్లనే కొట్టి!

Published Fri, Nov 6 2015 2:29 PM | Last Updated on Sun, Sep 3 2017 12:08 PM

లాఠీ లాక్కుని.. కానిస్టేబుళ్లనే కొట్టి!

లాఠీ లాక్కుని.. కానిస్టేబుళ్లనే కొట్టి!

(వెబ్‌సైట్ ప్రత్యేకం)
అది ముంబై చెంబూరు ప్రాంతంలోని సహకార్ థియేటర్. 1979వ సంవత్సరం.. కొంతమంది కుర్రాళ్లు బ్లాక్ టికెట్లు అమ్ముతున్నారు. నగరవ్యాప్తంగా బ్లాక్ టికెట్ల దందా మీద విరుచుకుపడుతున్న ముంబై పోలీసులు.. సహకార్ థియేటర్ వద్ద కూడా లాఠీలు విదిలించారు. అంతలో అక్కడ బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లలో ఓ కుర్రాడు వచ్చి, ఓ కానిస్టేబుల్ వద్ద లాఠీ లాక్కుని ఐదుగురు పోలీసులను బాగా కొట్టాడు. వాళ్లలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి కూడా. ఆ ఒక్క సంఘటనతో ముంబైలోని గ్యాంగుల కళ్లు ఆ కుర్రాడి మీద పడ్డాయి. అతడి పేరు రాజేంద్ర సదాశివ్ నిఖల్జే. చాలామంది పిలిచినా అతడు మాత్రం రాజన్ నాయర్ అనే మాఫియా డాన్ గ్యాంగులోకే వెళ్లాడు. రాజన్ నాయర్‌ను అంతా బడా నాయర్ అని పిలిచేవాళ్లు. తమిళనాడు నుంచి ముంబై వెళ్లిన బడా నాయర్.. తొలిరోజుల్లో టైప్ రైటర్లు దొంగతనం చేసేవాడు. ఓసారి పోలీసులు చోర్‌బజార్‌లో అతడిని అరెస్టు చేసి రకరకాల కేసులు పెట్టి మూడేళ్ల పాటు జైల్లో ఉంచడంతో.. జైలే నాయర్‌ను మాఫియా డాన్‌గా మార్చింది. బడా నాయర్‌కు మొదట్లో నమ్మకస్తుడిగా ఉండే కుంజు అహ్మద్ అనే వ్యక్తి అతడిని మోసం చేసి, వేరే గ్యాంగు పెట్టుకోవడమే కాక.. నాయర్ ఎంతగానో ప్రేమించిన యువతిని ఎత్తుకెళ్లిపోయాడు. ఆ తర్వాత రాజేంద్ర నిఖల్జే ఈ గ్యాంగులో చేరి.. నాయర్‌కు బాగా నమ్మకస్తుడిగా మారాడు. ఎత్తు కూడా తక్కువగా ఉండటంతో అందరూ అతడిని ఛోటా రాజన్ అని పిలిచేవాళ్లు.

కొన్నాళ్ల తర్వాత కుంజు చేతిలో బడా రాజన్ హత్యకు గురయ్యాడు. దాంతో ఛోటారాజన్ ఆదేశాల మేరకు ముంబైలో బంద్ పాటించారు. అప్పటికి శివసేన లాంటి పార్టీలు కూడా ఇంకా బంద్ పిలుపు ఇచ్చేవి కావు. బంద్ విజయవంతం కావడంతో ఛోటా రాజన్ పేరు మాఫియా వర్గాల్లో కూడా అందరికీ బాగా తెలిసింది. తర్వాత కుంజును హతమార్చేందుకు అతడు వేసిన ప్లాన్లు, వాటిని అమలుచేసిన తీరు.. ఇవన్నీ దావూద్ ఇబ్రహీం దృష్టిని ఆకట్టుకున్నాయి. దాంతో ఛోటా రాజన్‌కు దావూద్ అడ్డా అయిన 'ముసాఫిర్‌ఖానా' నుంచి పిలుపు వచ్చింది. దావూద్ గ్యాంగ్ నుంచి ఆహ్వానం అందడమంటే చిన్న విషయం కాదు కాబట్టి వెంటనే మారు మాట్లాడకుండా వెళ్లి చేరిపోయాడు.

దావూద్ అండదండలకు తోడు తన తెలివితేటలతో కుంజును అతడి సొంత ప్రాంతంలోనే హతమార్చాడు ఛోటా రాజన్. అప్పటి నుంచి దావూద్‌కు నమ్మకస్తుడైన అనుచరుడిగా మారిపోయాడు. ఆ గ్యాంగులో ప్రముఖుడిగా కూడా ఎదిగాడు. కానీ తర్వాతి కాలంలో దావూద్‌తో విభేదాలు తలెత్తి, వేరే సొంత గ్యాంగు పెట్టుకోవడమే కాక.. దావూద్ మనుషులను చంపించడంలో కూడా ముందడుగు వేశాడు. 27 ఏళ్ల క్రితం దేశం విడిచి పారిపోయి వివిధ దేశాల్లో రకరకాల వ్యాపారాలు చేస్తూనే ముంబైలో తన మాఫియా సామ్రాజ్యాన్ని కూడా నడిపించాడు. దావూద్ మనుషులను హతమార్చడంతో దేశభక్త డాన్ అనే ముద్ర కూడా సంపాదించాడు. చివరకు ఆస్ట్రేలియా పోలీసులు అందించిన సమాచారంతో ఇంటర్‌పోల్ వర్గాలు బాలిలో అరెస్టు చేయడంతో ఇన్నాళ్లకు మళ్లీ ఢిల్లీ చేరుకున్నాడు.

-కామేశ్వరరావు పువ్వాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement