
‘గే’లని కిందకు తోసి చంపారు
- ఐఎస్‌ఐఎస్ మరో అకృత్యం
లండన్: ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల అకృత్యాలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. స్వలింగ సంపర్కులు(గే) అన్న కారణంతో ఇరాక్‌లోని నినేవా పట్టణంలో ఇద్దరు యువకులను భవనంపై నుంచి కిందకు తోసి చంపారు. అక్రమ సంబంధం కలిగి ఉందంటూ ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపారు. వివిధ కారణాలతో మరో 17 మందిని కూడా అత్యంత కిరాతకంగా పొట్టనబెట్టుకున్నారు.
గత రెండ్రోజుల్లో ఐఎస్ ఉగ్రవాదులు ఈ ఘాతుకాలకు పాల్పడినట్లు లండన్‌లోని సిరియాకు చెందిన మానవ హక్కుల సంస్థ ఒకటి వెల్లడించింది. శిక్షల అమలుకు ముందు ఒక వ్యక్తి చిన్న కాగితంపై రాసుకువచ్చిన సందేశాన్ని చదివాడు. ఇస్లాం సిద్ధాంతాలకు విరుద్ధంగా వీరు ప్రవర్తించినందున శిక్షలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత ఒక యువకుడిని అందరూ చూస్తుండగానే ఎత్తై భవనం నుంచి కిందకు తోశారు. అనంతరం మరో వ్యక్తిని అలాగే చంపేశారు.