గుర్రపు బండిలో తీసుకెళ్తున్న జార్జ్ ఫ్లాయిడ్ శవ పేటిక
వాషింగ్టన్: శ్వేత జాతీ పోలీసుల చేతిలో దారుణ హత్యకు గురయిన ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ స్వస్థలమైన హ్యూస్టన్‌లో మంగళవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. తన తల్లి సమాధి పక్కనే ఆయన మృతదేహాన్ని కూడా ఖననం చేశారు. ఆరు రోజుల సంతాప దినాల తర్వాత మూడు నగరాల్లో ఫ్లాయిడ్ మృతదేహాన్ని ప్రదర్శించారు. ఫ్లాయిడ్ పుట్టిన నార్త్ కరోలినాలోని రేఫోర్డ్, అతను పెరిగిన హ్యూస్టన్, అతడు మరణించిన మిన్నియాపాలిస్ నగరాల్లో ప్రదర్శించారు. వేలాది మంది ఫ్లాయిడ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు తరలి వచ్చారు. వీరిలో నటులు జామీ ఫాక్స్, చాన్నింగ్ టాటమ్, రాపర్ ట్రే థా ట్రూత్, రిపబ్లిక్ షీలా జాక్సన్ లీ, హూస్టన్ పోలీస్ చీఫ్ ఆర్ట్ అసేవెడో, హ్యూస్టన్ మేయర్ సిల్వెస్టర్ టర్నర్, గ్రామీ విజేత నే-యో కూడా ఉన్నారు.
మాజీ వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్, ఫ్లాయిడ్ ఆరేళ్ల కుమార్తెను ఉద్దేశిస్తూ.. ‘ఏ పిల్లలు అడగలేని చాలా ప్రశ్నలు నీ మదిలో తలెత్తుతున్నాయని నాకు తెలుసు. తరాలుగా నల్ల జాతి పిల్లలంతా ఈ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. జాత్యాంహకారాన్ని రూపమాపడానికి.. సమ న్యాయం చేయడానికి. భవిష్యత్తులో మన పిల్లలు ఎందుకు ఇలా జరిగింది అంటే మనం సమాధానం చెప్పగలగాలి’ అన్నారు. అయితే ఆయన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ఎలాంటి విమర్శలు చేయలేదు. మరి కొందరు మాత్రం ట్రంప్‌పై విమర్శల వర్షం కురిపించారు. ‘అధ్యక్షుడు మిలిటరీని తీసుకురావడం గురించి మాట్లాడుతుంటాడు. కాని 8 నిమిషాల 46 సెకన్ల పాటు జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య గురించి అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు’ అని పౌర హక్కుల కార్యకర్త రెవ. అల్ షార్ప్టన్ అన్నారు. ట్రంప్ మానవ హక్కుల గురించి చైనాను సవాలు చేస్తాడు. కానీ జార్జ్ ఫ్లాయిడ్ మానవ హక్కు గురించి మాట్లడడు అన్నారు. (బంకర్ బాయ్)
Comments
Please login to add a commentAdd a comment