శాన్‌ఫ్రాన్సిస్కో : పనిప్రదేశంలో లైంగిక వేధింపులు, వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగులు గురువారం కార్యాలయాల నుంచి వాకౌట్ చేశారు. ఉద్యోగుల ప్రతినిధులను బోర్డులోకి తీసుకోవాలని, వేధింపుల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అనుగుణంగా మానవ వనరుల విధానాల్లో మార్పులు తీసుకురావాలని గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్‌ను ఆందోళన చేపట్టిన ఉద్యోగులు డిమాండ్ చేశారు.
గూగుల్ ఉద్యోగులు తమ వాకౌట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మీటూ ప్రకంపనల నేపథ్యంలో పనిప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గూగుల్ ఉద్యోగులు పనికి విరామం ప్రకటించి ఆందోళన బాటపట్టారు. పలు బహిరంగ వేదికలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా ఉద్యోగులు పలు నిర్మాణాత్మక సూచనలతో ముందుకొచ్చారని, వారి సూచనలను అమలు చేసేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు అల్ఫాబెట్‌కు చెందిన 94,000 మంది ఉద్యోగులు, వందలాది కాంట్రాక్టర్ల అసంతృప్తి కంపెనీ షేర్లపై ప్రభావం చూపకపోయినా తమ ఆందోళనను విస్మరిస్తే కంపెనీకి రిక్రూట్‌మెంట్, సిబ్బందిని నిలుపుకోవడంలో సమస్యలు ఎదురవుతాయని ఉద్యోగుల ప్రతినిధులు పేర్కొన్నారు. మరోవైపు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న కంపెనీ ఉన్నతాధికారులకు గూగుల్ భారీ ప్యాకేజీలతో వీడ్కోలు పలికిందన్న వార్తల నేపథ్యంలో కంపెనీ తీరుపై గూగుల్ ఉద్యోగులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment