పొడవైన సొరంగ మార్గం... | Gotthard tunnel: World's longest and deepest rail tunnel opens in Switzerland | Sakshi
Sakshi News home page

పొడవైన సొరంగ మార్గం...

Published Thu, Jun 16 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

పొడవైన సొరంగ మార్గం...

పొడవైన సొరంగ మార్గం...

సాధారణంగా బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని భూగర్భ సొరంగ మార్గాలు నిర్మిస్తారు. వీటికి భారీ వ్యయంతోపాటు చాలా ఏళ్లపాటు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. రవాణాకు ప్రత్యామ్నాయంలేని సమయంలో ఈ మార్గాలను ఎంచుకుంటారు. ఇదే కోవకు చెంది, దాదాపు 20 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించింది ‘గోథార్డ్ సొరంగం’. ఇది స్విట్జర్లాండ్‌లో పలు రవాణా సమస్యలను అధిగమించేందుకు నిర్మించారు. ప్రపంచంలోనే అతి పొడవైన భూగర్భ సొరంగ రైలు మార్గం ఇది. ఈ నెల జూన్ 1న ప్రారంభమైన నేపథ్యంలో దీని పూర్తి విశేషాలు తెలుసుకుందాం...
 
ప్రత్యేకతలు..

గోథార్డ్ బేస్‌డ్ రైలు సొరంగ మార్గం. ఇది స్విట్జర్లాండ్‌లో ఉంది. రెండు ప్రధాన నగరాలను కలుపుతూ 57 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేశారు. దీనిలో రెండు సింగిల్ ట్రాక్స్‌తో కూడిన మార్గాలను ఏర్పాటు చేశారు.స్విట్జర్లాండ్ లోని ఆల్ఫ్ ,దక్షిణ యూరప్ ప్రాంతాలను కలుపుతూ దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఈ రైలు మార్గం మొత్తం పొడవు 152 కి.మీ కాగా అందులో 57 కి.మీలు భూగర్భ మార్గం కావడం విశేషం.

పర్వతాల ఉపరితలం నుంచి 2.5 కిలోమీటర్ల లోతులో, దాదాపు 73 రకాల కఠినమైన శిలలను తొలగించి దీన్ని నిర్మించారు. ఎత్తై కొండల మధ్య నిర్మించిన  గోథార్డ్‌ను ఈ ఏడాది జూన్ 1న ప్రారంభించారు. డిసెంబర్ నుంచి పూర్తి రైల్వే సేవలు ఇక్కడ ప్రారంభం కానున్నాయి.

ఈ మార్గం నిర్మాణం పూర్తయితే స్విస్‌లోని జూరిచ్ ప్రాంతం నుంచి ఇటలీలోని మిలాన్ చేరుకోవడానికి కేవలం రెండున్నర గంటల సమయమే పడుతుంది. అయితే జపాన్‌లోని సీకన్ సొరంగ మార్గం 53 కి.మీ మేర ఉండి ప్రపంచంలో అతి పెద్దదిగాను, తర్వాత బ్రిటన్-ప్రాన్స్‌లను కలుపుతూ 50 కి.మీ దూరంతో ఉన్న సొరంగ మార్గం రెండవ స్థానంలో ఉండేవి. గోథార్డ్ బేస్‌డ్ దీని రికార్డులను తిరగరాస్తూ... 57 కి.మీ సొరంగ మార్గం ఉండి ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
 
దూరం తగ్గించేందుకే...
ఆల్ఫ్, దక్షిణ యూరప్ ప్రాంతాలకు మధ్య పూర్తిగా రాళ్లతో నిండిన కొండలు మాత్రమే ఉన్నాయి. దీంతో ఈ రెండు ప్రాంతాల మధ్య రవాణాకు బాగా ఇబ్బందులేర్పడేవి. ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో 1980 నాటికే చాలా సొరంగ మార్గాలు ఏర్పాటు  చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఆల్ఫ్‌కి చేరువలో ఉన్న ఎరెస్టిఫైడ్ నుంచి దక్షిణ యూరప్‌లోని  టింకోప్రాంతాన్ని కలుపుతూ ఓ సొరంగ మార్గాన్ని నిర్మించారు. కాని ఇది చిన్నగా ఉండడంతో రైళ్ల రాకపోకలకు అనువుగా ఉండేది కాదు. 1947లోనే నాటి ఇంజనీర్ ఎడ్వర్డ్ గ్రూనర్ సలహా మేరకు గోథార్డ్‌ను ప్రారంభించదలచారు. ఆ సమయంలో ప్రఖ్యాత ఇంజనీర్ జియోవాన్ని లంబార్డి నేతృత్వంలో దీనికి నమూనాలను తయారుచేశారు.అనంతరం 1996లో పని ప్రారంభించారు.
 
రోజూ 2500 మంది కష్ట ఫలితమే...
బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ఈ ఏడాది జనవరి నాటికే పూర్తయింది.  దీని నిర్మాణానికి ముందస్తుగానే 20 ఏళ్ల ప్రణాళికను స్విట్జర్లాండ్  ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రోజు 2500 మంది కూలీలు 20 ఏళ్లుగా దీని నిర్మాణంలో పాలుపంచుకున్నారు. అంతేకాదు ఈ మార్గం గుండా నడిచే రైళ్లన్నీ విద్యుత్తు ద్వారానే నడుస్తాయి.గంటకు 250 నుంచి 260 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.ప్రయోజనాలు..
భారీ పెట్టుబడులను వెచ్చించి నిర్మించిన ఈ సొరంగ మార్గం రవాణా సౌకర్యాన్ని చాలా వరకు మెరుగుపర్చింది. 3500 నుంచి 4000 టన్నుల వరకు ఒక్కో రైలులో రవాణా చేయవచ్చు. ఇక్కడ ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లలో ప్రతి రోజు 260 గూడ్స్, 64 ప్యాసింజర్ రైళ్లు ప్రయాణిస్తాయి. ఈ మార్గం గుండా ప్రయాణించడంతో సమయం చాలా వరకు ఆదా అవుతుంది. కేవలం 45 నిమిషాల్లో ఎరెస్టిఫెడ్ నుంచి బోడియో ప్రాంతానికి చేరుకోవచ్చు.
 
స్విస్ ఓటర్ల సాయంతోనే..
గోథార్డ్ సొరంగ మార్గం నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుందని స్విస్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇంత మొత్తం తన దగ్గర లేకపోవడంతో స్విస్ ప్రారంభంలో యూరోపియన్ దేశాల సహకారం కోరింది.ఆ దేశాల నుంచి సహాయం అందినప్పటికీ దీని నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో 1990లోనే ఈ ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆగిపోయాయి. స్విస్ ఓటర్లు ముందుకొచ్చి ప్రభుత్వానికి చేయూతనిచ్చారు. ఒక్కో ఓటరు దాదాపు రూ.90 వేలు సహాయంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. వీరి సహాయంతోనే ఈ ప్రాజెక్టు 2016 జనవరినాటికే పూర్తయింది.
 
2016 జూన్1 న ప్రారంభం..
2016 జనవరిలోనే ఈ ప్రాజెక్టు పూర్తి నిర్మాణం పూర్తయింది. స్విస్ ఫెడరల్ అధ్యక్షుడు  జోహాన్ సీండర్ అమ్మాన్ సహా జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మోర్కెలా, ప్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండ్, ఇటలీ ప్రధాని మట్టియో రెంజీలు ఈ ప్రాజెక్టును లాంచనంగా జూన్ 1న ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 9మంది స్విస్ కార్మికులకు అమ్మాన్ ఆర్థిక సహాయం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement