కిలో వంకాయలు 200.. టమోటా 120!
భారీ వర్షాలతో అస్తవ్యస్తంగా మారిన చెన్నై నగరంలో జనజీవనం దుర్భరంగా తయారైంది. వంకాయలు కిలో రూ. 200, టమోటా రూ. 120 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోంది. ఏటీఎంలు కూడా పనిచేయకపోవడంతో చాలామందికి ఖాతాల్లో డబ్బులున్నా, చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతున్నారు. నిత్యావసరాల కొరత పట్టిపీడిస్తోంది. ఈరోజు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పడంతో అంతటా ఆందోళన నెలకొంది. దాదాపు ఆరు రోజులుగా చెన్నైలో చాలా ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ప్రాంతాల వారీగా కరెంటును పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నా, ఇంకా నీరు నిల్వ ఉండటంతో ఎప్పటికి వస్తుందో చెప్పలేకపోతున్నారు. టెలికం వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. కొన్ని శివారు ప్రాంతాల్లో మాత్రమే ఫోన్లు పనిచేస్తున్నాయి. బీఎస్ఎన్ఎల్, ప్రైవేటు ఆపరేటర్ల ఫోన్లు ఏవీ పనిచేయడం లేదు. దాంతో తమవాళ్లు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో తెలియక సతమతం అవుతున్నారు
రవాణా ఇంకా అనుమానమే
తమిళనాడు నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా వ్యవస్థ ఏ మార్గంలోనూ ఇంకా సరిగా లేదు. రోడ్డు, రైల్వే, విమాన ప్రయాణాలు ఏవీ ఇంకా మొదలు కావట్లేదు. శుక్రవారం నాడు మెరీనా బీచ్ నుంచి నాలుగు రైళ్లను హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు నడిపించారు గానీ శనివారం మళ్లీ రైళ్లు ఆగిపోయాయి. కోయంబేడు బస్టాండు నుంచి కూడా పదుల సంఖ్యలో మాత్రమే బస్సులు వెళ్తున్నాయి. కోయంబేడు బ్రిడ్జి మీద నుంచి నీళ్లు ప్రవహిస్తుండటంతో రాకపోకలు సాధ్యపడటం లేదు. ఇక అరక్కోణం విమానాశ్రయం నుంచి చిన్నచిన్న విమానాలను నడిపించాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు భావించారు. ఈరోజు తనిఖీలు చేశాక తుది నిర్ణయం తీసుకుంటారు. తాంబరం ఎయిర్‌పోర్టు నుంచి అరక్కోణం తీసుకెళ్లి, అక్కడ నుంచి విమానాలు నడిపించాలని చూస్తున్నారు.
అన్నీ సర్వనాశనం: స్థానికులు
నాలుగు రోజుల నుంచి కరెంటు లేదని, తొలుత పీకలోతు వరకు ఉండే నీళ్లు ఇప్పుడు కొంచెం తగ్గాయని, అయితే ఒక్కళ్లు కూడా తమను చూసేందుకు రాలేదని స్థానికులు వాపోయారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న సామాన్లు అన్నీ పాడైపోయాయని, వాహనాలు సర్వనాశనం అయ్యాయని చెప్పారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి లీటరు పాలు రూ. 150 పెట్టి కొనుక్కురావాల్సి వస్తోందని తెలిపారు. ఎవరికైనా ఏమైనా చెబుదామంటే ఫోన్లు పనిచేయడం లేదని అన్నారు. అంబులెన్సును పిలవాలన్నా వీలుపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.