
‘60 ఏళ్లలో ఇలాంటి అనుభవమే లేదు’
సిడ్నీ: ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ సెల్వూడ్(73) అనే ఓ పెద్ద మనిషికి ఓ భయానక అనుభవం ఎదురైంది. బోటులో సరదాగా చేపల వేటకు వెళ్లి తిరిగొస్తుండగా ఒక పెద్ద షార్క్ అతడు ప్రయాణిస్తున్న పడవను ఢీకొట్టి అమాంతం బోటులో పడింది. అదిపడిన వేగానికి ఆ బోటులోని టెర్రీ కాస్త గాల్లోకి ఎగిరి నీళ్లల్లో పడ్డాడు. సరిగ్గా అతడు ఒడ్డుకు చేరుకునే సమయంలో ఈ ఘటన జరగడంతో తొందరగా స్పందించిన సమీప గస్తీ దళం అతడిని రక్షించింది. చేతికి స్వల్పగాయంతో బతికి బయటపడ్డాడు. టెర్రీ సెల్వూడ్ మరో నలుగురితో కలిసి న్యూసౌత్‌వెల్స్‌లోని ఎవాన్స్ జలాల్లో తన మరపడవపై చేపల వేటతో విహరిస్తున్నాడు.
ఆ సమయంలో అతడికి ఎదురైన అనుభవం ఆయన మాటల్లోనే చూస్తే.. ‘బోటువైపు ఏదో దూసుకొస్తున్నట్లుగా నాకు కొంచెం మసకగా అనిపించింది. వేగంగా ఓ షార్క్ వచ్చి నా చేతిని అందుకొని మెలేసింది.. నా కాళ్లను చేతుల్ని పట్టి కిందపడేసేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో అది కాస్త వచ్చి బోటులో పడటంతో నేను గాల్లోకి ఎగిరిపడ్డాను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నీళ్లలో పడ్డాను. ఒక పెద్ద అల వచ్చి నన్ను ముంచెత్తేలోగా కొంతమంది రక్షించారు. షార్క్ దాదాపు తొమ్మిది అడుగులు ఉంది. నా బోటు దానికి ఇరుకైపోయింది. నేను 60 ఏళ్లుగా చేపలుపడుతున్నా నాకెప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు’ అని ఆయన చెప్పారు.