బర్త్‌డే క్యాండిల్స్‌తో గిన్నిస్ రికార్డు!
బర్త్‌డే క్యాండిల్స్‌తో గిన్నిస్ రికార్డు!
Published Wed, Dec 7 2016 2:15 PM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM
బర్త్‌డే కేక్ మీద ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తారు... సాధారణంగా అయితే పుట్టినరోజును బట్టి ఒకటి నుంచి పది వరకు అయితే అన్ని క్యాండిల్స్, ఆ తర్వాత అయితే ఆ అంకె ఆకారంలో ఉన్నవి వెలిగిస్తారు. కానీ, అమెరికాలో ఒక ఆధ్యాత్మిక గురువు జయంతి సందర్భంగా ఏకంగా 72వేలకు పైగా క్యాండిల్స్ వెలిగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. స్వామి చిన్మయ కిషోర్ ఘోష్ 85వ జయంతి సందర్భంగా న్యూయార్క్‌లో ఈ వినూత్న ప్రక్రియ చేపట్టారు. 1964లోనే న్యూయార్క్ నగరానికి వెళ్లిపోయిన స్వామి చిన్మయ.. అక్కడ పాశ్చాత్యులకు ధ్యానం నేర్పించారు. ఆయన శిష్యులు ఇప్పటికీ అమెరికా సహా పలు దేశాల్లో ఉన్నారు. తాజాగా ఆయన 85వ జయంతి సందర్భంగా వంద మంది కలిసి న్యూయార్క్ నగరంలోని శ్రీ చిన్మయ సెంటర్‌లో ఓ భారీ కేకును ఏర్పాటుచేశారు.
మొత్తం 72,585 క్యాండిల్స్ సిద్ధం చేసి, ప్రతి క్యాండిల్‌ను ఆ భారీ కేకు మీద ఉంచి, 60 బ్లోటార్చిల సహాయంతో వాటిని వెలిగించారు. వెలిగిన తర్వాత చూస్తే... అది ఏదో పెద్ద హోమంలా అనిపించింది. 40 సెకండ్ల పాటు ఆ క్యాండిల్స్ వెలుగుతూనే ఉన్నాయి. తర్వాత వాటిని అగ్నిమాపక పరికరాలతో ఆర్పాల్సి వచ్చింది. సాధారణంగా అయితే నోటితో ఊది క్యాండిల్స్ ఆర్పుతారు గానీ, ఇక్కడ మంటలు చాలా పెద్దస్థాయిలో ఉండటంతో అది సాధ్యం కాక కార్బన్ డయాక్సైడ్ సిలిండర్లతో ఆర్పారు. తర్వాత కేకు మీద పడిన మైనం మొత్తాన్ని జాగ్రత్తగా దాని మీద నుంచి తుడిచేశారు. ఆ తర్వాత కేకును పంచిపెట్టారు. ఇంతకుముందు కాలిఫోర్నియాలో మైక్ హార్డ్ లెమనేడ్ పేరుమీద అత్యధిక క్యాండిల్స్ వెలిగించిన రికార్డు ఉంది. అప్పుడు 50,151 క్యాండిల్స్ వెలిగించారు.
Advertisement
Advertisement