రక్తం తీశారు.. ‘గిన్నిస్’కెక్కారు
దుబాయ్: అదో పెద్ద షాపింగ్ మాల్.. వచ్చిన వాళ్లను వచ్చినట్లుగా క్యూలో నిలబెట్టారు.. వరుసబెట్టి వారి రక్తం తీసుకుని పరీక్షలు చేశారు.. గిన్నిస్ రికార్డు కొట్టేశారు.. అసలు జరిగిందేమిటో తెలుసా? దుబాయ్‌లో మధుమేహం విజృంభిస్తుండడంతో... జనంలో చైతన్యం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం ఎప్పుడూ జనంతో కిక్కిరిసిపోయే దుబాయ్ షాపింగ్ మాల్‌ను ఎన్నుకొంది.
80 మంది నర్సులను ఏర్పాటు చేసి.. మాల్‌కు వచ్చినవారికి వచ్చినట్లుగా మధుమేహం పరీక్షలు చేసింది. మొత్తంగా 80 మంది నర్సులు ఎనిమిది గంటల్లో 8,675 మందికి ఈ పరీక్షలు చేశారు. ఒకేచోట తక్కువ సమయంలో ఎక్కువ రక్తపరీక్షలు చేసిన రికార్డుతో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కేశారు. అయితే.. పరీక్ష చేయించుకున్నవారిలో ఎంత మందికి మధుమేహం ఉందనేది మాత్రం వెల్లడించలేదు మరి.