రీల్ హీరోనే కాదు.. రియల్ హీరో
హాలీవుడ్ ప్రముఖ నటుడు 72 ఏళ్ల హారిసన్ ఫోర్డ్ వెండితెర మీదే కాదు.. నిజజీవితంలో కూడా హీరోగానే ఉన్నారు. గురువారం ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానంలో ఇంజన్ పనిచేయక అత్యవసరంగా దాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కూడా ఏమాత్రం ఆందోళనకు గురికాకుండా చాకచక్యంగా దాన్ని గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించి పరోక్షంగా ఎంతోమంది ప్రజల ప్రాణాలను కాపాడారు. స్టార్ వార్స్ సిరీస్ సినిమాల్లో, ఎయిర్‌ఫోర్స్ వన్ సినిమాలో స్వయంగా స్టంట్లు చేసిన హారిసన్ ఫోర్డ్ మంచి నైపుణ్యం గల పైలట్. ఆయన రెండో ప్రపంచయుద్ధం కాలం నాటికి చెందిన సింగిల్ ఇంజన్ గల చిన్న వింటేజ్ విమానంలో గురువారం నాడు విహారయాత్రకు వెళ్లాడు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో గగనతలంలో విహరిస్తుండగా హఠాత్తుగా అందులోని ఇంజన్ చెడిపోయింది.
ఏ మాత్రం కంగారు పడకుండా దగ్గరలో ఉన్న శాంటా మోనికా విమానాశ్రయం వైపు విమానాన్ని మళ్లించారు. విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం కోసం విమానాశ్రయం అధికారులను కోరారు. వారు అందుకు అనుమతించినా విమానాశ్రయం రన్‌వేకు చేరుకోలేకపోయారు. సమీపంలో ఉన్న జనావాస ప్రాంతాల వైపు వెళ్లకుండా విమానాన్ని ఆ పక్కనే ఉన్న కాలిఫోర్నియా గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించారు. అక్కడ కూడా భారీ చెట్లను తప్పించుకొని అత్యంత చాకచక్యంగా విమానాన్ని క్రాష్‌ల్యాండింగ్ చేశారు. విమానం జనావాస ప్రాంతాల వైపు వెళ్లకుండా ఉండేందుకు విమానాన్ని ఏకంగా 180 డిగ్రీల కోణంలో గోల్ఫ్‌కోర్టు వైపు మళ్లించడం సాహసోపేతమైన చర్యను ప్రమాదస్థలాన్ని సందర్శించిన విమానయాన నిపుణుడు రిక్ డేక్ తెలిపారు.
చెట్లకు తగలకుండా అతి జాగ్రత్తగా విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ చేయడం, అందులో 72 ఏళ్ల వయసులో అలా చేయడం మామూలు విషయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలి ఉక్లా మెడికల్ సెంటర్ ఆస్పత్రిలో చేరిన ఫోర్డ్‌కు ప్రాణాపాయం లేదని ఆయన కుమారుడు బెక్ ఫోర్డ్ తెలిపారు.
1966లోనే పైలట్ లైసెన్స్ పొందిన ఫోర్డ్ ఇంతకుముందు కూడా నిజ జీవితంలో పలు సాహసాలు చేశారు. 2000 సంవత్సరంలో టెటాన్ కౌంటీ (అమెరికా)లోని ఇడాహో ఫాల్స్ వద్ద గల పర్వతాల్లో 11,106 అడుగు ఎత్తులో చిక్కుకున్న ఓ మహిళా పర్వతారోహకురాలిని ప్రాణాలకు తెగించి అక్కడికి తన విమానంలో వెళ్లి ఆమెను రక్షించారు. ఆ తర్వాత 2001 సంవత్సరంలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అడవుల్లో తప్పిపోయిన బాలుడిని సాహసోపేతంగా రక్షించి తీసుకొచ్చారు. గతేడాది స్టార్‌వార్స్ ఏడో ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా మిలీనియం ఫెలికాన్ స్పేస్‌క్రాఫ్ట్ తలుపు విరిగిపడడంతో ఫోర్డ్ కారు విరిగింది. కోలుకున్నాక ఆ షూటింగ్‌ను పూర్తి చేశారు.