
బీజింగ్ : సాధారణంగా చలి అంటేనే బయటకు వెళ్లే సాహసం చేయలేము. ఒక వేళ బయటకు వచ్చినా ఆ పని ముగించుకొని వెంటనే వెళ్లిపోతుంటాం. అలాంటిది కటిక చలికంటే భయంకరంగా ఉండే మంచుగడ్డకట్టుకుపోయిన నదిలో దిగి సాయం చేసే సాహసం సాధ్యమవుతుందా.. బహుషా అది అందరికీ సాధ్యం కాదేమో.. చైనాలో ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించాడు. ఉదయాన్ని బైక్‌పై వెళుతున్న షి లై (54) అనే వ్యక్తి మంచుగడ్డకట్టుకుపోయిన నదిలో ఓ పెద్దావిడ పడిపోయి ఉండటాన్ని గమనించాడు.
వెంటనే తన బైక్ ఆపేసి నదిలోకి పరుగులు తీశాడు. నదిలో నుంచి ఆమెను బయటకు లాగుతూ అడ్డుగా ఉన్న ఐస్‌ను తనఒంటి చేత్తో బలంగా మోది పగులగొట్టాడు. అతడి తెగింపును చూసి మరో వ్యక్తి తోడుగా వచ్చాడు. ఎట్టకేలకు ఆ ఇద్దరు కలిసి ఆ పెద్దావిడను సురక్షితంగా బయటపడేశారు. అనంతరం ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగినప్పుడు తాను పెద్దగా ఆలోచించలేదని, తన పని తాను చేసి వెంటనే ఇంటికి వెళ్లి ఓ గిన్నెలో అల్లం నీరు తాగి ఆఫీసుకు వెళ్లిపోయానని వివరించాడు. కాగా, అతడి సాహసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.