మామ్.. డాడీతో మళ్లీ ఫ్రెండ్‌గా ఉండవా?
అట్టావా: పిల్లలు పెద్దవాళ్లలా మాట్లాడితే 'ఏంటా ఆరిందలా మాటలు' అని విసుక్కునేవారు, ముచ్చటపడి మురిసిపోయే తల్లిదండ్రులూ ఉంటారు. కెనడాకు చెందిన ఆరేళ్ల టియానా విడిపోయిన తల్లిదండ్రులను స్నేహితుల్లా ఉండాలంటూ ముద్దు ముద్దు మాటలతో హితవు చెప్పి ప్రపంచాన్నే విస్మయపరుస్తోంది.
కెనడాలోని సుర్రే నగరానికి చెందిన చెరిష్ షెర్రీ అనే ఓ మహిళ తన భర్తతో విడిపోయింది. వారు మళ్లీ కలిసుండే విషయమై గొడవ పడుతుంటే టియానా తన తల్లిని ఓ గదిలోకి తీసుకెళ్లి అక్కడున్న మెట్లపై కూర్చొని ఇలా మాట్లాడింది...
'మామ్, నీవు డాడీతో మళ్లీ ఫ్రెండ్‌గా ఉండాలనుకుంటున్నావా ?'
'అవును' తల్లి సమాధానం.
'మరీ అంత పెద్దగా చెప్పొద్దు (రెండు చేతులు పెకైత్తి). ఏదైనా కింది స్థాయిలో ఉండాలన్నదే నేను కోరుకునేది. నీకు ఏ మేరకు సాధ్యమవుతుందో ఆ మేరకే ఉండు. నా మామ్, డాడీ విడిపోయి ఆ స్థానంలో వేరెవరో రావాలని నేను కోరుకోవడం లేదు. నాకు నీవు, డాడీ ఇద్దరూ కావాలి. మీరిద్దరూ ఫ్రెండ్లీగా ఉండాలి. నేను నా స్వార్థం కోసం ఈ మాటలు చెప్పడం లేదు. అందరూ ఫ్రెండ్స్‌గా ఉండాలన్నదే నా ఆలోచన. నేను నైస్‌గా ఉన్నప్పుడూ మనమందరం నైస్‌గా ఉండొచ్చు.
మళ్లీ నా స్వార్థం కోసం నేను చెప్పడం లేదు. నా హృదయంలో ఉన్నది నేను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. అంతకుమించి మరేం లేదు. నా మామ్, నా డాడ్, అందరూ ఫ్రెండ్స్‌గా ఉండాలి. అందరూ నవ్వుతూ గడపాలి. నీవు అలాగా ఉంటావని నేననుకుంటున్నా. నీవు కూడా కొంత తగ్గుతావని, పరిస్థితులు చక్కబడాలని నేను కోరుకుంటున్నా. సాధ్యమైనంత వరకు అందరు మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలి. అంతకుమించి ఏమి అక్కర్లేదు' అంటూ ఆరేళ్ల ఆరింద చిన్నపాటి తన ఉపన్యాసాన్ని ముగించగానే 'థాంక్యూ, టియానా' అంటూ షెర్రీ... ముందుకొచ్చి టియానాను ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెడుతూ ఎంతో మురిసిపోయింది.
'కూతురిచ్చిన ఈ సందేశం నాకో మేలుకొల్పు. నాకు కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. సిగ్గుతో కుంచించుకుపోయినట్టయింది. నాకు నా కూతురు హితోపదేశం చేయడం మరోపక్క దిగ్భ్రాంతి కలిగించింది' అంటూ షెర్రీ వ్యాఖ్యానించింది. ఆమె కూతురిచ్చిన మూడు నిమిషాల ఉపన్యాసాన్ని వీడియోలో రికార్డు చేసి 'ఫేస్‌బుక్'లో పోస్ట్‌చేయగా ఇప్పటికే 60 లక్షల మంది యూజర్లు దాన్ని వీక్షించారు.