నన్ను భయపెట్టినందుకు థాంక్స్!
''మెరుపు మెరిస్తే, వానకురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే'' అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టుగా పిల్లలు పువ్వుల్లా ఎంతో సుకుమారంగా, సున్నితంగా ఉంటారు కదా! అలాంటి ఆ పసివాళ్లు భయపడితే..ఆ ప్రభావం వారి మనసులపై తీవ్ర ప్రభావాన్నే పడేస్తుంది. అలా తనకు, తమ కుటుంబానికి ఎదురైన ఓ భయంకరమైన అనుభవాన్ని తలుచుకుంటూ.. ఓ చిన్నారి తన ఆవేదనకు అక్షర రూపాన్నిచ్చింది.
తమకు నచ్చిన వస్తువులను, బహుమతిగా వచ్చిన బొమ్మలను ఎంతో అపురూపంగా దాచుకుంటారు పిల్లలు. అంతగా అభిమానించినవి ఉన్నట్టుండి పోతే.. ఎంత బెంగపడతారు! తన బాధ తెలుసుకున్న తరువాతైనా మీరు మారండి అంటున్న ఆ చిన్నారి రాసిన బహిరంగ లేఖ కరుడుగట్టిన నేరస్తులను సైతం ఆలోచనలో పడేస్తుంది. ఈ ఉత్తరాన్ని యూకేకు చెందిన పారిస్ ముల్ హోలాండే (11) అనే చిన్నారి రాసింది.
''వాళ్లు మానవత్వం లేని మనుషులు.. నేను ఎంత బాధపడ్డానో.. నా మనసు ఎంత కష్టపడిందో వారికి తెలియజేయాలనే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇప్పటికైనా వాళ్లు పశ్చాత్తాప పడతారని ఆశిస్తున్నాను. నా బెడ్ మీద పడుకోవాలంటేనే భయంగా ఉంది. ఆ దుర్మార్గులు నా రూంలోకి వచ్చి నా వస్తువులన్నీ దోచుకెళ్లారు.. ఇది నన్ను చాలా భయపెట్టింది. ఇది ఎవరి రూం, ఎవరి వస్తువులు ఇవేవీ వారికి పట్టవు.. నాకు చాలాకాలంగా చీకటి అంటే భయం... దాన్ని అధిగమించాను. కానీ మీరు నా రూంలోకి వచ్చినప్పటి నుంచి భయం మళ్లీ నన్ను చుట్టుకుంది.
ఎందుకు ఇలా జరిగిందో నాకు తెలియదు.. అందుకే బాగా ఏడ్చాను.. దాదాపు రెండు గంటల పాటు అలా ఏడుస్తూనే ఉన్నాను. నా నోట మాటలు లేవు.. నాకెంతో ఇష్టమైన డిస్నీ బొమ్మ లెగోను ధ్వంసం చేశారు. మా ఫ్యామిలీ ఫొటో చూసిన తర్వాతైనా వారి మనసు మారలేదా? వాళ్లకు తెలుసు.. ఇది చిన్న పాప రూం అని.. అయినా ఈ పని చేశారు. నిజంగా నన్ను భయపెట్టినందుకు థాంక్స్...'' ఇలా సాగుతుంది ఆ చిన్నారి లేఖ. చివరగా.. ''తలుపులకు తాళాలు వేసుకోండి. మీ వస్తువులు కాపాడుకోండి. నాలాంటి అనుభవం మీకెవ్వరికీ ఎదురు కాకూడదు'' అంటూ అందరికీ జాగ్రత్తలు కూడా చెప్పింది.
యూకేలోని సౌత్ యార్క్షైర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పారిస్ ఇంట్లోకి చొరబడిన దొంగలు విలువైన వస్తువులు, నగదును దోచుకెళ్లారు. వారం క్రితం ఆమె పుట్టినరోజు సందర్భంగా.. ఆమెకు వచ్చిన బహుమతులు కూడా చోరీకి గురయ్యాయి. వాళ్ల ఫ్యామిలీ ట్రిప్ ఫొటోలున్న ఐ ఫోన్‌ను కూడా ఎత్తుకెళ్లారు. దీంతో బెంగపడిన పారిస్.. ఈ ఉత్తరం రాయడం అక్కడి పోలీసు అధికారులను సైతం కదిలించింది.
క్రిస్మస్ పండుగ బహుమతులు, పారిస్ పుట్టిన రోజు కానుకలతో పాటుగా, అమ్మమ్మ బంగారు వాచ్, లాప్ టాప్, ఐ ఫోన్ ఎత్తుకెళ్లారని పారిస్ తల్లి గెమ్మ(29) తెలిపారు. ఈ ఘటనతోతన పాప చాలా భయపడిపోయిందన్నారు. ఇలా ఉత్తర రాయడం ద్వారా ఆమెకు కొంత ఉపశమనాన్ని పొంది ఉంటుందన్నారు. ఈ ఘటన ఆ పాపపై తీవ్ర ప్రభావం చూపడం విచారకరమని సౌత్ యార్క్‌షైర్ పోలీస్ పీసీ ఆడమ్ వ్యాఖ్యానించారు. నేరస్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.