కొన్ని సంఘటనలు నిజంగా అరుదే
మాస్కో: కొన్ని సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ, జీవితాంతం గుర్తుండిపోతాయి. కొన్నిసార్లు చేసే సాయం నిమిషాల, గంటల కష్టాన్ని మాయం చేసినా కొన్నిసార్లు చేసే సాయం మాత్రం ఏకంగా బ్రతుకునిస్తుంది. అలాంటి సాయం పొందిన వ్యక్తి, సాయం చేస్తున్నప్పుడు చూసిన వ్యక్తి, సాయం చేసిన వ్యక్తి వారిలో వారు జీవితాంతం మిగిలిపోతారు. రష్యాలో ఇలాంటి సందర్భం ఆవిష్కృతమైంది. ఈ నెల ప్రారంభంలో మాస్కోలోని ఓ భవంతిలో పెద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
దీంతో అందులో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సాధారణంగానే ఫైర్ సిబ్బంది అందులోని మనుషులందరినీ ఖాళీ చేస్తున్నారు. అదే సమయంలో ఓ గదిలో ఓ పిల్లి దాదాపు చనిపోయినదానిలా పడిపోయి ఉంది. వెంటనే ఆఫైర్ సిబ్బందిలో ఒక వ్యక్తి తను పెట్టుకున్న ఆక్సిజన్ మాస్క్ను పిల్లికి పెట్టాడు. దానివైపు తదేకంగా చూశాడు. కాసేపట్లోనే చచ్చినదానిలా పడి ఉన్న ఆ పిల్లి గట్టి శ్వాస తీసుకొని ఒక్కసారిగా కళ్లు తెరిచింది.
తన ప్రాణం కాపాడిన ఆ ఫైర్ మ్యాన్ వైపు ధన్యవాదాలు చెబుతున్నట్లుగా చూసి మెల్లగా బయటకు కదిలింది. తను అల్లారు ముద్దుగా పెంచుకున్న పెట్ క్యాట్ తిరిగి ప్రాణాలతో వస్తుండంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవనుకోండి. ఆ ఫైర్ మ్యాన్కు ఆమె ధన్యవాదాలు కూడా చెప్పింది.