పైకి, కిందకు, పక్కలకూ లిఫ్టు..
భారీషాప్టు.. ఇనుప తీగలు.. పైకి, కిందికి నిట్టనిలువునా కదలికలు. మనం ఇప్పుడు చూస్తున్న లిఫ్టు(ఎలివేటర్) 160 ఏళ్లుగా ఇలాగే ఉంది. ఆకారంలో కొద్దిగా మార్పు వచ్చినా, అద్దాల గదితో భవనానికి వెలుపల కట్టినా దాదాపుగా అన్నిలిఫ్టుల టెక్నాలజీ మాత్రం ఇదే. అయితే, త్వరలోనే ఇక సరి కొత్త ‘అయస్కాంత’ లిఫ్టులు రాబోతున్నాయి. వీటికి తీగలుండవు. దేనికీ అతుక్కుని ఉండవు. గోడకు కొద్ది దూరంలో గాల్లో తేలుతూనే నడుస్తాయి. పైకి, కిందికే కాకుండా పక్కలకు కూడా కదులుతాయి.
కుదుపులు అసలే ఉండవు. ఒకే షాఫ్టుపై వరుసగా నాలుగైదు లిఫ్టులూ కదులుతాయి. సెకనుకు ఐదారు మీటర్లు దూసుకెళతాయి కాబట్టి లిఫ్టుల కోసం క్యూలు కట్టాల్సిన పని కూడా ఉండదు. నిమిషానికో లిఫ్టు మన ముందొచ్చి ఆగుతుంది. ‘మల్టి’ అనే ఈ వినూత్నలిఫ్టును జర్మనీకి చెందిన‘థెసైన్‌క్రప్’ గ్రూపు కంపెనీ రూపొంది స్తోం ది. జర్మనీలోని రోట్‌వీల్‌లో ప్రత్యేకంగా నిర్మిస్తున్న భవనంపై 2016లో ఈ లిఫ్టును పరీక్షించనున్నారు. సుమారుగా 300 మీటర్లు ఎత్తు ఉండే భవనాలకు ఇలాంటి లిఫ్టులు బాగుంటాయని, చిన్న భవనాలకు సరిపోయే డిజైన్లనూ రూపొందిస్తామని కంపెనీవారు చెబుతున్నారు.
ఇంతకూ ఎలా పనిచేస్తుందంటే...: ‘మాగ్నటిక్ లెవిటేషన్(మాగ్లేవ్)’ టెక్నాలజీ ఆధారంగా ఈ లిఫ్టు పనిచేస్తుంది. భవనం గోడపై లిఫ్టు మార్గంలో పెద్ద షాఫ్టు ఉంటుంది. దానిపై శక్తిమంతమైన అయస్కాంతాలు ఉంటాయి. అదేవిధంగా లిఫ్టుగదిపై బయటివైపూశక్తిమంతమైన అయస్కాంతాలు ఉంటాయి. ఈ రెండూ ఏర్పర్చే అయస్కాంత క్షేత్రం వల్ల లిఫ్టుపై గురుత్వాకర్షణ ప్రభావం తగ్గిపోయి అది గోడపై కొద్దిఎత్తులో గాలిలో కిందపడకుండానే నిలబడుతుం ది. లిఫ్టుమార్గంలోని షాఫ్టు చుట్టూ మ్యాగ్నటైజ్డ్ కాయిల్, దాని నుంచి లిఫ్టు క్యాబిన్‌లకు విద్యుత్ అందే ప్రత్యేక మల్టీలెవల్ బ్రేక్ సిస్టమ్ ఉంటాయి. గాలి లో ఉండడం వల్ల లిఫ్టుకు ఘర్షణ ఉండదు కాబట్టి.. కొద్దిపాటి శక్తితోనే వేగం గా, సులభంగా కదులుతుంది. ప్రస్తుతం జపాన్‌లో ఈ టెక్నాలజీతో రైళ్లు నడుపుతున్నారు. చైనాలో మాగ్లేవ్ రైలు గతేడాది పరుగులు పెట్టింది.