బండచాకిరి.. బ్రెడ్డు ముక్క.. పీనుగలా మార్చారు
సింగపూర్: బండచాకిరి చేయించుకుంటూ ఏమాత్రం జాలిదయ లేకుండా వ్యవహరించి దాదాపు 15 నెలలుగా తనను చిత్ర హింసలకు గుర్తు చేశారని సింగపూర్ దంపతులపై ఓ పిలిప్పీన్స్ శరణార్థి ఫిర్యాదు చేసింది. థెల్మా గవిడాన్(40) అనే పిలిప్పీన్స్ కు చెందిన మహిళ 2014 ఏప్రిల్ నెలలో శరణార్థిగా వచ్చి ఓ సింగపూర్ కు చెందిన దంపతుల ఇంట్లో చిక్కుకుపోయింది. అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే ఉంచి అన్ని పనులు చేయించుకుంటూ రోజుకు కొన్ని నూడుల్స్, ఒక బ్రెడ్డు ముక్క మాత్రం పడేస్తూ ఆమె ఆకలి ఆర్తనాదాలను నిర్లక్ష్యం చేశారు.
ఫలితంగా ఆమె దాదాపు 29 కేజీల బరువు తగ్గిపోయి పీనుగలా తయారైంది. అతి తక్కువ వేతనం మాత్రమే ఇవ్వడం కాకుండా ఆమెను ప్రతిక్షణం గమనించేవారని, ఎవరితో మాట్లాడనిచ్చేవారు కాదని తెలిపింది. 'నేను నిద్ర లేచినప్పటి నుంచి ఏమి తింటున్నాను, ఏమి తాగుతున్నాను, ఆఖరికి స్నానం చేసేముందు కూడా వదిలిపెట్టకుండా ఓ నిఘా మాదిరిగా నన్ను గమనించేవారు అంటూ గవిడాన్ వాపోయింది. ఎంతోకాలంగా రహస్యంగా ఉంచిన ఆమె విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.