
హిల్లరీ సేవకులను బిజీగా మార్చిన ట్రంప్
న్యూయార్క్: మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతున్న డెమొక్రటిక్ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తొలిసారి ముఖాముఖిగా చర్చాగోష్ఠిలో పాలుపంచుకుంటున్న నేపథ్యంలో హిల్లరీకి ప్రసంగపాఠం తయారుచేసేవారు బిజిబిజీగా మారిపోయారంట. వారంతా ఇప్పుడు ట్రంప్ అసలు ఎలాంటివాడు? ఆయన వ్యక్తిగత పరిస్థితులు ఏమిటి? ఆయన మానసిక పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుంది? ఎలాంటి సమాధానం చెబితే ఆయన ఎలా స్పందిస్తాడు? ఆయన పర్సనాలిటీ మొత్తం ఎలా ఉంటుందనే విషయాలను స్కానింగ్ చేస్తున్నారట.
దీనికోసం వారు ప్రత్యేకంగా గత నెలలోనే పనిని ప్రారంభించి నివేదికలు తెప్పించుకున్నారట. ట్రంప్ కు బాగా దగ్గరయినవారి నుంచి గతంలో ఆయన వ్యక్తిగత సలహాదారులుగా పనిచేసి మానేసినవారు, ప్రసంగాలు తయారు చేసి ఇప్పుడు మానేసిన వారి నుంచి ట్రంప్ సమాచారం హిల్లరీ తరుపువాళ్లు తెప్పించారట. ట్రంప్ వాగ్దాటి ఎలా ఉంటుందో ఇప్పటికే తెలిసిందే. ఒక అంశం నుంచి మరో అంశంలోకి ఆయన అప్పటికప్పుడు ఇష్టమొచ్చినట్లుగా వివాదాస్పదంగా మాట్లాడగలడు.. అలాగే వివాదంలోకి నెట్టగలడు. ఈ నేపథ్యంలోనే హిల్లరీ ఈ విషయంలో పలు జాగ్రత్తలే పాటిస్తున్నారంట. గతంలో ఆమె జరిపిన ప్రచారానికి, ప్రసంగాలకు పూర్తి భిన్నమైన వ్యూహంతో హిల్లరీ ఈ ముఖాముఖి ద్వారా ముందుకు వెళుతోందని అక్కడి మీడియా చెబుతోంది.
పిలిప్పీ రైన్స్ చాలా కాలంగా ట్రంప్ ప్రసంగ పాఠాలు రూపొందిస్తున్నాడు. కొన్ని గంటలపాటు ట్రంప్, హిల్లరీ మధ్య చర్చ జరగనున్న నేపథ్యంలోనే అందుకు తగ్గ వ్యూహాలనే భారీగా సిద్ధం చేస్తున్నారంట. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి తర్వాత వారిద్దరి మధ్య ఈ చర్చాగోష్ఠి జరగనుంది. ఇలాంటి చర్చాగోష్ఠిలు మొత్తం మూడు ఉంటాయి. ఇప్పటికే గెలవడానికి ఇద్దరికీ సమానావకాశాలు ఉన్నాయనీ, ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొందని వాషింగ్టన్ పోస్ట్, ఏబీసీ న్యూస్ సంయుక్తంగా నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్‌లో తేలింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది.