అంగారక సూట్!
వ్యోమగాములు అనగానే.. గాలితో బాగా ఉబ్బిపోయిన తెల్లటి సూట్ ధరించి తలకు ఓ పెద్ద హెల్మెట్ పెట్టుకొని రోబోల్లా మెల్లగా అడుగుతీసి అడుగు వేసే మనుషులే మనకు గుర్తొస్తారు. అంతరిక్షంలో శూన్య వాతావరణం, సంక్లిష్టం, బరువైన స్పేస్ సూట్‌ల వల్లే వ్యోమగాములు మనలా తేలికగా కదలలేరు. అందుకే.. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వ్యోమగాముల కోసం అతితేలికైన కొత్త తరం ‘స్కిన్‌టైట్’ స్పేస్ సూట్‌ను రూపొందిస్తున్నారు. భవిష్యత్తులో మానవసహిత అంగారక యాత్రలకు దీనిని ఉపయోగించేందుకు సిద్ధం చేస్తున్నారు.
పీడనానికి గురిచేసిన వాయువులతో నిండి ఉండే సంప్రదాయ స్పేస్‌సూట్‌ల మాదిరిగా కాకుండా దీనిని స్థితిస్థాపక ధర్మాలు కలిగిన ప్రత్యేక లోహపు పదార్థాన్ని కూర్చి తయారు చేస్తున్నారు. మన శరీరంలోని కండరాల మాదిరిగా సంకోచించే ఈ పదార్థపు పట్టీలు.. వేడి చేసినప్పుడు కుంచించుకుపోయి.. చల్లబర్చినప్పుడు తిరిగి యథా ఆకారంలోకి వస్తాయి. వీటితో తయారు చేసిన స్పేస్ సూట్ కూడా ఒక బటన్ నొక్కగానే వ్యోమగాముల శరీరానికి అతుక్కున్నట్లు కుంచించుకుపోయి స్కిన్ టైట్ అవుతుంది. దీన్ని ధరిస్తే మార్స్‌పై స్వల్ప గురుత్వాకర్షణలోనూ వ్యోమగాములు సులభంగా కదులుతూ అనేక పనులు చేసుకోవచ్చని చెబుతున్నారు.