న్యూయార్క్ : వారం రోజుల అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం ప్రత్యేక మెనూ సిద్ధమైంది. హోస్టన్ చెఫ్ కిరణ్ వర్మ ప్రధాని కోసం ప్రత్యేకంగా రెండు రకాల నమో తాలి, నమో తాలి మిఠాయి పేరుతో పసందైన వంటకాలను వడ్డించనున్నారు. ఐక్యరాజ్యసమితి 74వ సాధారణ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ బసచేసే హోటల్‌లోతో పాటు అమెరికా పర్యటన ఆసాంతం ప్రత్యేక మెనూతో చవులూరించే వంటకాలను సిద్ధం చేస్తారు. ఈ వంటకాలన్నీ స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారుచేస్తారు. ప్రధాని మెనూలో పలు రకాల పచ్చళ‍్లను పొందుపరిచారు.
నమో తాలి మిఠాయిలో రస్‌మలై, గజర్ కా హల్వా, బాదం హల్వా, ష్రికండ్‌లు ఉండగా, నమో తాలి సేవ్రిలో కిచిడీ, కచోరీ, మేతి తెప్లా వంటకాలున్నాయి. పలు రాష్ట్రాలు, నగరాల్లో ప్రాచుర్యం పొందిన వంటకాలను ప్రధాని కోసం సంసిద్ధం చేస్తామని చెఫ్ కిరణ్ పేర్కొన్నారు. ప్రధాని ఆరగించే పదార్ధాలను సిద్ధం చేయడం తనకు ఇదే తొలిసారని ఆమె తెలిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం అమెరికా బయలుదేరిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా పలు కంపెనీల సీఈవోలతో భేటీ అవుతారు. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ పాల్గొనే హౌడీ మోదీ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment