![Houston police chief tells Keep your mouth shut - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/2/Donald-trump.jpg.webp?itok=kGk7yFhn)
వాషింగ్టన్ : నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ పోలీసుల చేతిలో మృతిచెందడాన్ని నిరసిస్తూ అగ్రరాజ్యం అమెరికాలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మినియాపొలిస్‌లో ప్రారంభమైన నిరసన జ్వాలలు అమెరికాలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు అంటుకున్నాయి. ఆందోళనకారులను కించపరుస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిరసనలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది. లూటింగ్ మొదలైతే.. షూటింగ్ తప్పదని హెచ్చరిస్తూ ట్రంప్ గత వారం సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రకంపనలు రేపుతోంది. దీనిపై టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగర పోలీస్ చీఫ్ ఆర్ట్ అసేవెడో డొనాల్ట్ ట్రంప్‌కు గట్టిగానే బదులిచ్చారు. ట్రంప్ నోరు మూసుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. (నిరసనలపై మండిపడ్డ ట్రంప్)
ఇలాంటి వ్యాఖ్యల వల్ల నిరసనకారుల ఆగ్రహం ఇంకా పెరుగుతుందని, ఇలా వ్యాఖ్యలు చేయడం వారిని రెచ్చగొట్టడమే అవుతుందన్నారు. నిరసనకారులను రెచ్చగొట్టకుండా ట్రంప్ నోరు మూసుకోవడం సరైనదని సూచించారు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటానికి బదులుగా సమస్య పరిష్కారానికి చొరవ చూపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇదిలావుండగా జార్జ్ మృతిపై ఆందోళన ఉధృతమవుతున్న తరుణంలో.. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికను బహిర్గతం చేశారు. దీంతో ఆందోళనకారుల ఆగ్రహం మరింత పెరిగింది. ఏకంగా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను తాకింది. ఈ క్రమంలో ట్రంప్ బంకర్‌లో తల దాచుకున్నట్లు వార్తలు వెలుపడ్డాయి. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన)
Comments
Please login to add a commentAdd a comment