
‘నన్ను నమ్మితే కౌగిలివ్వండీ!’
పారిస్: నగరమంతా విషాధం అలుముకున్న సమయం అది. ఇటీవల టెర్రరిస్టుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన 129 మంది అమాయక ప్రజలకు నివాళి అర్పించేందుకు కూడలి వద్దకు వచ్చిన ప్రజలంతా కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు. ఇంతలో అక్కడికి కళ్లకు గంతలు కట్టుకున్న ఓ ముస్లిం యువకుడు వచ్చి నిలబడ్డాడు. అతని చేతిలో ఓ ప్లే కార్డ్ ఉంది. దానిపై ‘నేను ఒక ముస్లింను. నన్నంతా టెర్రరిస్టు అని అంటున్నారు. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మితే నా వద్దకు వచ్చి నన్ను ఆలింగనం చేసుకోండి’ అని రాసింది.
నివాళి అర్పిస్తున్న పిన్నలు, పెద్దలంతా ఆ యువకుడి వద్దకు వెళ్లి, వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఆ యువకుడిని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆ యువకుడు కళ్లకు కట్టుకున్న గంతలు విప్పేసి, తనను నమ్మి ఆలింగనం చేసుకున్న వారందరికి ధన్యవాదాలు తెలిపాడు. ‘ఇలా అడిగినందుకు నన్ను క్షమించండి. ఓ సందేశం ఇవ్వడం కోసమే నేను ఇలా చేయాల్సి వచ్చింది. నేను ముస్లింను. అయినంతమాత్రాన నేను టెర్రరిస్టును కాను. నేనెప్పుడూ ఎవరినీ చంపలేదు.
మారణహోమం జరిగిన గత శుక్రవారం నాడు నా పుట్టిన రోజు. కానీ జరుపుకోలేదు. కనీసం బయటకు కూడా రాలేదు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. టెర్రరిస్టు అంటే టెర్రరిస్టే. ఏ కారణం లేకుండా అమాయకులను చంపేవాడు. ముస్లిం అయినంత మాత్రాన టెర్రరిస్టు కాడు. ముస్లిం అనేవారు ఎవరినీ చంపరు. చంపడాన్ని ముస్లిం మతం నిషేధిస్తోంది’ అని యువకుడు వ్యాఖ్యానించాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను వీడియో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా, ఒక్క ఫేస్‌బుక్‌లోనే ఇప్పటి వరకు కోటి మంది యూజర్లు వీక్షించారు. లక్షా యాభై వేల మంది లైక్స్ కొట్టారు.