కాబూల్లో ట్రక్కు బాంబు పేలుడు
కాబూల్: ఆప్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారీ ట్రక్కు బాంబు పేలుడు కలకలం సృష్టించింది. విదేశీయులను లక్ష్యంగా చేసుకొని పూల్-ఏ-చర్కి ప్రాంతంలోని హోటల్ వద్ద ఈ పేలుడు జరిగింది. ఆదివారం అర్థరాత్రి తరువాత జరిగిన ఈ శక్తివంతమైన బాంబు పేలుడు.. కాబూల్ మొత్తం వినిపించిందని స్థానికులు మీడియాతో వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామే నంటూ తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పేలుడు పదార్ధాలతో నిండిన ట్రక్కును పేల్చేసిన అనంతరం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ లో ఓ పోలీసు సైతం మృతి చెందాడు.
కాబూల్లో గత వారం ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో 80 మంది మృతి చెందగా.. 230 మంది గాయపడిన విషయం తెలిసిందే.