తమ కుటుంబసభ్యులను పోగొట్టుకుని శవపేటికల వద్ద రోదిస్తున్న బాలుడు
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ ఆత్మాహుతి దాడి సంభవించింది. పెళ్లి వేడుకను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన పేలుడులో 63 మంది ప్రాణాలు కోల్పోగా 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘోరానికి పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ప్రకటించుకుంది. శనివారం సాయంత్రం కాబూల్ పశ్చిమ ప్రాంతంలోని దుబాయ్ సిటీ వెడ్డింగ్ హాల్‌లో మిర్వాయిజ్ అనే యువకుడి పెళ్లి వేడుక జరుగుతోంది. సుమారు 1,200 మంది ఆ వేడుకకు హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం మహిళలు, పిల్లలు ఒక వైపు, పురుషులకు మరోవైపు వేరుగా వేడుకలకు ఏర్పాట్లు జరిగాయి. పురుషులంతా పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో అక్కడికక్కడే 63 మంది చనిపోగా 182 మంది గాయపడ్డారు. ఆ హాలంతా మృతదేహాలు, రక్తం, శరీరభాగాలతో భయానకంగా మారింది. పేలుడు తీవ్రతకు ఆ హాలు పైకప్పు బీటలు వారింది. ఆ హాలు దాదాపు 20 నిమిషాల సేపు పొగ, ధూళితో నిండిపోయింది. అందులోని పురుషుల్లో ప్రతి ఒక్కరూ గాయపడటమో ప్రాణాలు కోల్పోవడమో జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ‘ఈ విషాదం నన్ను జీవితాంతం వెంటాడుతుంది. నా సోదరుడు, స్నేహితులు, బంధువులు చనిపోయారు. నా కుటుంబ సభ్యులు షాక్‌తో ఉన్నారు.
నవ వధువు స్పృహ కోల్పోయింది’ అని పెళ్లి కొడుకు మిర్వాయిజ్ గద్గద స్వరంతో మీడియాతో అన్నాడు. కాగా, అఫ్గాన్‌లో షియాల పెళ్లి వేడుకలు అట్టహాసంగా జరుగుతుంటాయి. పండుగ వాతావరణంలో గంటలకొద్దీ కొనసాగే ఈ వేడుకలకు వందలు, ఒక్కోసారి వేలల్లోనే బంధువులు, పరిచయస్తులు హాజరవుతుంటారు. మామూలుగా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోని, ఎక్కువ సంఖ్యలో గుమికూడే షియా వివాహ వేడుకలే లక్ష్యంగా ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు మారణహోమం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనను అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు.
ఈ ఘటనకు తమదే బాధ్యతని ఐఎస్ సంస్థ ప్రకటించుకుంది. తమ సభ్యుడొకరు ఆత్మాహుతి దాడికి పాల్పడగా, మరికొందరు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాలను పేల్చివేశారని టెలిగ్రామ్ యాప్ ద్వారా వెల్లడించింది. సున్నీలు మెజారిటీ సంఖ్యలో ఉన్న అఫ్గాన్‌లో షియాలపై ఐఎస్ తరచూ దాడులకు పాల్పడుతోంది. అఫ్గానిస్తాన్‌లో మోహరించిన తమ బలగాల ఉపసంహరణ, శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధికారులు ఉగ్రసంస్థ తాలిబన్‌తో ఒక వైపు చర్చలు సాగిస్తుండగానే ఈ ఘోరం సంభవించింది. ఇలా ఉండగా, బల్ఖ్ ప్రావిన్సులో రోడ్డు పక్కన అమర్చిన మందుపాతర పేలి కారులో వెళ్తున్న ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment