
తల్లి గర్భం నుంచి బిడ్డను తీసి ట్రోఫీలాగా పట్టుకొని..
మెక్సికో: సాధారణంగా తల్లి గర్భంలో నుంచి శిశువు బయటకొచ్చే సమయం ఎంతో టెన్షన్గా ఉంటుంది. ఆ బిడ్డ క్షేమంగా బయటి ప్రపంచంలో అడుగుపెట్టడం ఒకెత్తయితే ఆ బిడ్డను అంతే సురక్షితంగా శుభ్రం చేసి తల్లి ఒడిలో పెట్టడం మరో ఎత్తు. ఈ విషయంలో ఎంతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పనిచేయడంలో వైద్యులు మాత్రమే సిద్ధహస్తులు. ఆ సమయంలో వారు ఎన్నో జాగ్రత్తలు పాటిస్తారు. కానీ, మెక్సికోలో వైద్యులు మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తించారు.
అప్పుడే పుట్టిన శిశువును లేబర్ రూంలోనే ఒక ట్రోపీని పట్టుకున్నట్లుగా పట్టుకోవడమే కాకుండా ఆపరేషన్ చేసిన వైద్యుడి భుజంపై కూర్చొబెట్టే ప్రయత్నం చేశారు. అలా చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఈ ఫొటో ఇప్పుడు ఆన్ లైన్లో బయటకు రావడంతో పెద్ద వివాదమై కూర్చుంది. ముక్కుపచ్చలారని ఆ పసిగుడ్డును అలా చేసినందుకు తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆ దేశ ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఆ ముగ్గురు వైద్యులను అరెస్టు చేసేందుకు పోలీసులు కదిలారు. మెక్సికోలోని కాల్పులాల్పాన్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది.