అక్కడ ఎముకల కోసం మనుషుల్ని చంపేస్తారు! | Hunting for humans: Malawian albinos murdered for their bones | Sakshi
Sakshi News home page

అక్కడ ఎముకల కోసం మనుషుల్ని చంపేస్తారు!

Published Thu, Jun 9 2016 3:26 PM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

అక్కడ ఎముకల కోసం మనుషుల్ని చంపేస్తారు!

అక్కడ ఎముకల కోసం మనుషుల్ని చంపేస్తారు!

లిలాంగ్వే: ఆగ్నేయాఫ్రికాలోని మలావి దేశంలో కొనసాగుతున్న దారుణం అంతా ఇంతా కాదు. అల్బినో (పట్టు పాప) అనే జన్యుపరమైన లోపంతో పుడుతున్న పిల్లలను అక్కడ అడవిలో జంతువులను వేటాడినట్లుగా వేటాడుతాయి మానవమృగాలు. తెల్లగా పాలిపోయినట్టుండే చర్మం, కనుబొమ్మలు, కను రెప్పలతో, తెల్లటి జుట్టులో ఉండే వారి ఎముకల కోసం నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. వారి చేతి, కాళ్ల ఎముకలతో క్షుద్ర పూజలు చేస్తే అదృష్టం కలిసొస్తుందని, ఆరోగ్యం సహా అష్టయిశ్వర్యాలు సిద్ధిస్తాయనే మూఢ విశ్వాసం ప్రజల్లో నాటుకుపోయి ఉండడమే అందుకు కారణం.

అంతర్జాతీయ ఆమ్నెస్టీ బృందం ఇటీవల మలావి దేశాన్ని సందర్శించి స్థానికంగా నెలకొని ఉన్న దారుణ పరిస్థితులను ఓ నివేదికలో వెల్లడించింది. అల్బినో జన్యులోపంతో పుట్టిన పిల్లలు, యువకులను డబ్బు కోసం కిడ్నాప్‌చేసి హత్య చేసే ముఠాలు అక్కడ పెరిగిపోయాయని తెలిపింది. గత ఏప్రిల్‌ నెలలో ఓ పాపతో సహా నలుగురు వ్యక్తులను ఇలాగే కిడ్నాప్‌చేసి హత్య చేశారు. బాధితుల్లో 17 ఏళ్ల డెవిస్‌ ఫ్లెచర్‌ అనే యువకుడు కూడా ఉన్నాడు. తన స్నేహితుడితో కలసి సాకర్‌ గేమ్‌ చూడడానికి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. నలుగురు వ్యక్తులు ఆ యువకుడి వెంటబడి కిడ్నాప్‌ చేశారని, అతన్ని పొరుగునున్న మొజాంబిక్‌ దేశ సరిహద్దులకు తీసుకెళ్లి కాళ్లు, చేతులు నరికేసి ఎముకలు తీసుకున్నారని పోలీసులు తెలిపారు.

అనంతరం అతని శరీరంలోని ఇతర భాగాలను పాతి పెట్టారని వారు చెప్పారు. గత రెండేళ్లలో అధికారిక లెక్కల ప్రకారం 18 మంది అల్బినోలను హత్య చేశారని, మరో నలుగురిని కిడ్నాప్‌ చేశారని, వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదని ఆమ్నెస్టీ బృందం వెల్లడించింది. మలావిలో అల్బినోలు వందల సంఖ్యలో ఉన్నారని, వారిని మూఢ నమ్మకాల పేరిట జరుగుతున్న క్షుద్ర పూజల కోసం డబ్బులు ఆశించి కిడ్నాప్‌ చేసి, హత్య చేసే ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆ బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఆగ్నేస్‌ జొనాథన్‌ అనే మహిళకు ఇద్దరు ఆడ పిల్లలు అల్బినోలుగా పుట్టారని, వారు పాఠశాలకు వెళ్లి వచ్చేంతవరకు ఆమెకు మానసిక ఆందోళన తప్పడం లేదని ఆమ్నెస్టీ తెలిపింది. పిల్లలను బడికి పంపాలా, వద్దా ? అన్న సంశయం ఆమెను రోజూ వేధిస్తోందని చెప్పింది. ఈ దారుణాలు మలావితో పాటు సమీపంలోని మొజాంబిక్‌లో కూడా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. అల్బినోలు పెరిగి, పెద్దయ్యాక ఎప్పుడు మృత్యువాత పడతారో తెలియక నిత్యం ఆందోళన చెందిడం కన్నా పురిట్లో వారిని చంపేయడం మంచిదన్న భావం కొంత మంది తల్లుల్లో నెలకొందని ఆమ్నెస్టీ తెలిపింది. ఈ దారుణ పరిస్థితుల పట్ల ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement