రేపు అమెరికాను తాకనున్న'ఇర్మా'
ఫ్లోరిడా రాష్ట్రంలో అత్యంత అప్రమత్తత
► 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
► ఇర్మా ధాటికి కరేబియన్ దీవుల్లో 17 మంది మృతి
► ఇర్మా బాధితుల కోసం వైఎస్ జగన్ ప్రార్థన
మయామి: కరేబియన్ దీవుల్లో హరికేన్ ఇర్మా బీభత్సం శుక్రవారం కూడా కొనసాగింది. ఇర్మా విధ్వంసకాండకు కరేబియన్ దీవుల్లో ఇంతవరకూ 17 మంది మృత్యువాత పడగా దాదాపు 2.5 కోట్ల మందిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ అతిభయంకర తుపాను ఆదివారం ఉదయానికి అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని ‘ఫ్లోరిడా కీస్’ ప్రాంతాన్ని తాకవచ్చని అంచనావేస్తున్నారు. తీరాన్ని తాకే సమయంలో 25 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడవచ్చని, గంటకు 250 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని అమెరికా జాతీయ హరికేన్ విభాగం హెచ్చరించింది.
ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల నుంచి దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 2005లో హరికేన్ కత్రినా తర్వాత ఇంత పెద్దస్థాయిలో ప్రజల్ని తరలించడం ఇదే మొదటిసారి.ఫ్లోరిడాతో పాటు జార్జియా రాష్ట్రంపై పెను ప్రభావం చూపవచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. అమెరికా ఆగ్నేయ ప్రాంతం మొత్తం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఇది అత్యంత విధ్వంసకర తుపాను కావచ్చని అమెరికా ఎమర్జెన్సీ విభాగం చీఫ్ బ్రాక్ లాంగ్ హెచ్చరించారు.
హరికేన్ ఇర్మా తీవ్రతను శుక్రవారం ఉదయానికి అమెరికా జాతీయ హరికేన్ విభాగం కేటగిరి 4 స్థాయికి తగ్గించింది. ప్రస్తుతం తుపాను బహమాస్ దీవుల వద్ద ఉందని, గరిష్టంగా 250 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయని, ఇంకా అత్యంత ప్రమాదకరంగానే ఉందని హరికేన్ విభాగం తెలిపింది. ఫ్లోరిడాలో తాజా పరిస్థితి పట్ల చాలా ఆందోళనగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
60 శాతం పైగా దెబ్బతిన్న కరేబియన్ దీవులు
ఇర్మా దెబ్బకు కరేబియన్ దీవుల్లోని సెయింట్ మార్టిన్ వంటి చిన్న దీవులు దాదాపు 60 శాతం దెబ్బతిన్నాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, ప్యూర్టోరికోలు కూడా బాగా నష్టపోయాయి. పెనుగాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో పాటు, భారీ భవంతుల ముందు భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆస్తినష్టం ఊహించని స్థాయిలో ఉందని అధికారులు వెల్లడించారు. ప్యూర్టోరికోలో ఇద్దరు మరణించగా, దాదాపు 10 లక్షల మంది ఇంకా చీకట్లోనే ఉన్నారు.
అమెరికన్ వర్జిన్ ఐలాండ్స్‌లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డవారిని అమెరికా సహాయ సిబ్బంది హెలికాప్టర్లలో ప్యూర్టోరికోకు తరలించింది. సెయింట్ మార్టిన్, సెయింట్ బార్తెలెమి, గ్వాడెలోప్ తదితర ఫ్రాన్స్ దీవుల్లో మొత్తం 9 మంది మరణించారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరార్డ్ కొలొంబ్ తెలిపారు. మొత్తం 112 మంది గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన చెప్పారు. ఇక బ్రిటన్ తన అధీనంలోని దీవుల్లో సహాయక చర్యల కోసం సహాయ సామగ్రి, సిబ్బందితో రెండు సైనిక విమానాల్ని పంపింది.
తరుముకొస్తున్న మరో హరికేన్
డొమినికన్ రిపబ్లిక్ లో భారీ వర్షాలు, గాలులకు ఉత్తర, తూర్పు తీర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 20 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యూబాలో ముందు జాగ్రత్తగా 10 వేల మంది విదేశీ పర్యాటకుల్ని బీచ్ రిసార్ట్‌ల నుంచి తరలించారు. కాగా కరేబియన్ దీవుల వైపు మరో భయంకర హరికేన్ జోస్ దూసుకొస్తోంది. ప్రస్తుతం కేటగిరి 3 స్థాయిలో ఉన్న ఈ తుపాన్ మరింత బలపడి కరేబియన్ దీవుల మీదుగా అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ, కనటికట్ రాష్ట్రాల సమీపంలో తీరాన్ని దాటవచ్చని అంచనావేస్తున్నారు.
ఇర్మా బాధితుల కోసం వైఎస్ జగన్ ప్రార్థన
సాక్షి, అమరావతి: హరికేన్ ఇర్మా బాధితులు ప్రతి ఒక్కరి కోసం తాను ప్రార్థిస్తున్నట్టు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ట్వీట్ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని జగన్ ట్వీటర్‌లో ఆకాంక్షించారు. కరీబియన్ దీవుల్లో విధ్వంసం సృష్టించిన ఈ హరికేన్.. అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు.