
'నికోల్'తో వణుకుతున్న బెర్ముడా
హామిల్టన్: హరికేన్ 'నికోల్' బెర్ముడా ప్రాంతం వైపు దూసుకోస్తుందని బ్రిటిష్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సదరు హరికేన్తో ఈ ప్రాంతం అతలాకుతలం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. నికోల్ను తక్కువ అంచనా వేయవద్దుంటూ ప్రజలను హెచ్చరించారు. దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో నికోల్ హరికేన్ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. బుధవారం రాత్రికి లేదా గురువారం తెల్లవారుజాము కల్లా ఈ హరికేన్ బెర్ముడాను తాకుతుందని ద నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది.
బెర్ముడాకు నికోల్ రూపంలో ఆపద పొంచి ఉందని ఆ దేశ జాతీయ భద్రత మంత్రి జెఫ్ బారన్ తెలిపారని రాయల్ గెజట్ వార్తా పత్రిక వెల్లడించింది. ఈ హరికేన్ దూసుకోస్తున్న కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రజలను మంత్రి అప్రమత్తం చేసినట్లు పేర్కొంది. అన్ని విమాన సర్వీసులతోపాటు బస్సు, నౌక సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే స్కూళ్లతోపాటు వ్యాపార, వాణిజ్య సముదాయలను శుక్రవారం వరకు సెలవు ప్రకటించినట్లు వార్తా పత్రిక తెలిపింది.