
ఆస్టిన్ : ‘నేను చేసేది పాపం కాదు.. నేను క్షమాపణలు చెప్పాలి.. కానీ అలా ఎప్పటికీ చెప్పను’అంటూ టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో బాంబు దాడికి పాల్పడిన వ్యక్తి చెప్పాడు. అతడు దాడికి పాల్పడటానికి ముందే తాను ఎందుకు దాడి చేస్తున్నానో అనే విషయాన్ని అతడి ఫోన్‌లో 25 నిమిషాలపాటు రికార్డింగ్ చేసి ముందే పెట్టుకున్నాడు. దీంతో అతడు ఉద్దేశ పూర్వకంగా ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసినట్లు స్పష్టమైంది. మూడు వారాల కిందట ఆస్టిన్‌లో మార్క్ కాండిట్ అనే వ్యక్తి బాంబు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా పలువురు గాయపడ్డారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే సమయంలోనే తనను తాను పేల్చుకొని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.
ఈ సమయంలో పోలీసులకు అతడి ఫోన్ దొరికింది. దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో ఓ 25 నిమిషాల నిడివితో వీడియో లభించింది. ఆ వీడియోలో ఉన్న ప్రకారం తాను చేసేది తప్పుకాదని అతడు చెప్పాడు. తన చర్యను ఓ సైకోపాథ్‌గా వర్ణించుకుంటూ క్షమాపణలు చెప్పాల్సి ఉన్నా తాను ఎప్పటికీ చెప్పబోనని తెలిపాడు. బాల్యం నుంచే తన జీవితం చిందరవందరగా ఉందని, ఒక వేళ తనను బందించాలని వస్తే అప్పటికప్పుడే తనను పేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు అందులో రికార్డు చేసి పెట్టి ఉంచాడు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తాము అంతకంటే ఎక్కువ వివరాలు అందించలేమని పోలీసులు తెలిపారు. కాగా, మార్క్ రూమ్‌మేట్స్‌ను కొన్నిగంటలపాటు విచారించిన పోలీసులు అనంతరం విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment