22 వేలమంది ఉగ్రవాదుల జాడ తెలిసింది
లండన్: ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా వేలమంది ఉగ్రవాదుల వివరాలను బ్రిటన్కు చెందిన ఓ మీడియా బయటపెట్టింది. దాదాపు 22 వేలమందికి పైగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలను, వారి కుటుంబ సమాచారాన్ని వెల్లడించింది. ఇలా బయటపెట్టిన వివరాల్లో బ్రిటన్తో సహా 51 దేశాలకు చెందినవారు ఉన్నారు. దాదాపు అన్ని దేశాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరికలు జరుగుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల నుంచి బలహీనంగా ఉన్న దేశాలనుంచి ఈ సంస్థలో చేరుతున్నారు. అయితే, అలా చేరుతున్నవారి వివరాలు ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేస్తే తప్ప తెలియడం లేదు.
అలాంటిది బ్రిటన్కు చెందిన స్కై న్యూస్ అనే సంస్థ మాత్రం దానికి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. బ్రిటన్, ఉత్తర యూరప్, మధ్యాసియా, ఉత్తర ఆఫ్రికా, అమెరికా, కెనడాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. వారి పేర్లు, చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, కుటుంబ సమాచారం అందులో ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఫోన్లలో కొన్ని పనిచేస్తున్నాయని కూడా మీడియా సంస్థ తెలిపింది. కొంతమంది ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలో చేరిన తర్వాత తమ కుటుంబాలను విధ్వంసం సృష్టించేందుకు వాడుకుంటున్నాయని వివరించింది.