IS militants
-
భారీ బాంబు లక్ష్యమేంటి?
వ్యాసార్ధం ఒక మీటరు, పొడవు 9 మీటర్లు.. బరువు 10,251 కిలోలు! అఫ్గాన్‌లోని నంగర్హర్లో ఐఎస్ సొరంగాలపై అమెరికా వేసిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ విశేషాలివి. అయితే ఇంత శక్తిమంతమైన బాంబును ఐఎస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో లేని అఫ్గాన్‌లో ఎందుకు వేశారని యుద్ధనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అఫ్ఘాన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు 800 మందికి మించి లేరని అంటున్నారు. అంతేకాకుండా పెద్దగా ప్రభావం చూపలేని కొండగుహల ప్రాంతంలో ఆ బాంబును ఎందుకు వేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. ‘మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్’(ఎంఓఏబీ)గానూ పిలిచే ఈ బాంబు అణు బాంబు కాదు. ఇందులో 8,482 కిలోల పేలుడుపదార్థాన్ని కూర్చారు. జీపీఎస్ ఆధారిత ఎంఓఏబీ భూమికి 1.8 మీటర్ల ఎత్తులో ఉండగానే పేలిపోతుంది. దీంతో పేలుడు శక్తి నలుదిశలా విస్తరించి నష్టం ఎక్కువ కలుగుజేస్తుంది. ఇది గుహల్లోకి చొచ్చుకెళ్లేది కాదు. కొండలను తొలిచి స్థావరాలను ఏర్పాటు చేసుకునేటపుడు సూటిగా ఒకే మార్గం తవ్వరు. మార్గాలు పలు మలుపులు తిప్పుతారు. కాబట్టి నంగర్హర్లో గుహలన్నీ ధ్వంసమయ్యాయని చెప్పడానికి లేదు. బొరియల్లో దాక్కున్న వారిపై దాడులు చేసేటపుడు గుహద్వారాలు లక్ష్యంగా బాంబులు కురిపిస్తుంటారు. అందుకే అప్పట్లో తోరాబోరా గుహల్లో బిన్ లాడెన్ ఉన్నాడని తెలిసినా అమెరికా ఈ బాంబును వాడలేదు. ఇటీవల సిరియాలోని షయరత్ ఎయిర్‌బేస్‌పై అమెరికా 59 తొమహక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 34 క్షిపణులను రష్యా రక్షణ వ్యవస్థ సాయంతో సిరియా కూల్చేసింది. దీంతో సిరియా, ఇరాక్‌లలోని ఐఎస్ మిలిటెంట్లను భయపెట్టడానికి అమెరికా బలప్రదర్శన కోసం ఎంఓఏబీని వేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దాడిలో 36 మంది హతం మృతుల్లో కేరళవాసి! కాబూల్: అఫ్గానిస్తాన్‌లో గురువారం అమెరికా చేసిన భారీ బాంబు దాడిలో 36 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు అఫ్గాన్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక కేరళ వాసి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నంగర్హర్ రాష్ట్రంలోని అచిన్ జిల్లాలో అమెరికా వాయుసేన ఐసిస్ సొరంగాల సముదాయంపై వేసిన 11 టన్నుల ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ధాటికి పలు ఐసిస్ గుహలు, మందుగుండు సామగ్రి ధ్వంసమైంది. ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టమూ వాటిల్లేదన్నారు. కాగా, దాడిలో తమ మిలిటెంట్లెవరూ చనిపోలేదని ఐఎస్ ప్రకటించింది. దాడి మృతుల్లో కేరళ కాసర్గోడ్ జిల్లా పద్నా గ్రామానికి చెందిన ఐసిస్ మిలిటెంట్ ముర్షీద్ ఉన్నట్లు తనకు టెలిగ్రామ్ ద్వారా సమాచారం అందిందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత అబ్దుర్ రహిమాన్ తెలిపారు. కాగా, ‘మా సైన్యాన్ని చూసి గర్విస్తున్నాం. ఇది మరో విజయం. గత 8 వారాల్లో ఏం జరిగిందో చూస్తే గత ఎనిమిదేళ్ల జరిగినదానికి, ఇప్పటికి తేడా ఏమిటో తెలుస్తుంది’ అని వైట్‌హౌస్‌లో విలేకర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ‘అమెరికాకు తగిన బదులిస్తాం’ ప్యాంగ్యాంగ్: అమెరికా రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలకు నిర్ధాక్షిణ్యంగా బదులిస్తామని ఉత్తరకొరియా ప్రకటించింది. అణు పరీక్షలపై ఉత్తరకొరియా ముందుకు సాగితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలా స్పందించింది. కొరియా ద్వీపకల్పానికి అణు సామర్థ్యం ఉన్న విమానాలు ఎంత దగ్గరగా వస్తే అంతే కనికరం లేకుండా తామూ దాడులు చేస్తామని పేర్కొంది. కాగా, ఆరోసారి అణు పరీక్షలు చేస్తామన్న ఉత్తరకొరియా ప్రకటన పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఉత్తర కొరియా అణు పరీక్షలు జరిపితే ఆ దేశంపై ఎలాంటి సైనిక చర్యలు తీసుకోవాలనే దానిపై యోచిస్తున్నామని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు. -
22 వేలమంది ఉగ్రవాదుల జాడ తెలిసింది
లండన్: ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా వేలమంది ఉగ్రవాదుల వివరాలను బ్రిటన్‌కు చెందిన ఓ మీడియా బయటపెట్టింది. దాదాపు 22 వేలమందికి పైగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల వ్యక్తిగత వివరాలను, వారి కుటుంబ సమాచారాన్ని వెల్లడించింది. ఇలా బయటపెట్టిన వివరాల్లో బ్రిటన్‌తో సహా 51 దేశాలకు చెందినవారు ఉన్నారు. దాదాపు అన్ని దేశాలను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరికలు జరుగుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల నుంచి బలహీనంగా ఉన్న దేశాలనుంచి ఈ సంస్థలో చేరుతున్నారు. అయితే, అలా చేరుతున్నవారి వివరాలు ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేస్తే తప్ప తెలియడం లేదు. అలాంటిది బ్రిటన్‌కు చెందిన స్కై న్యూస్ అనే సంస్థ మాత్రం దానికి సంబంధించిన వివరాలను బయటపెట్టింది. బ్రిటన్, ఉత్తర యూరప్, మధ్యాసియా, ఉత్తర ఆఫ్రికా, అమెరికా, కెనడాలకు చెందినవారు ఇందులో ఉన్నారు. వారి పేర్లు, చిరునామాలు, టెలిఫోన్ నెంబర్లు, కుటుంబ సమాచారం అందులో ఉన్నాయి. ఇప్పటికీ ఈ ఫోన్లలో కొన్ని పనిచేస్తున్నాయని కూడా మీడియా సంస్థ తెలిపింది. కొంతమంది ఉగ్రవాదులు ఉగ్రవాద సంస్థలో చేరిన తర్వాత తమ కుటుంబాలను విధ్వంసం సృష్టించేందుకు వాడుకుంటున్నాయని వివరించింది. -
ఐసిస్ నుంచి రసాయనిక ఆయుధాల ముప్పు
ప్రపంచానికి పెను సవాల్‌గా మారిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దగ్గర రసాయనిక ఆయుధాలు ఉండటం మరింత కలవరపెట్టే అంశం. ఐసిస్ రసాయనిక ఆయుధాలను ఉపయోగించడంతో పాటు చిన్నపాటి ఆయుధాలను తయారు చేయగలదని అమెరికా గూఢచర్య సంస్థ (సీఐఏ) డైరెక్టర్ జాన్ బ్రెన్నన్ చెప్పారు. అంతేగాక నిధుల సేకరణ కోసం ఐసిస్ రసాయనిక ఆయుధాలను ఎగుమతి చేసే అవకాశముందని హెచ్చరించారు. వారు రవాణ చేయగలిగే మార్గాలను నియంత్రించడం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. ఐసిస్ దాడుల్లో రసాయనిక ఆయుధాలను వాడినట్టు తమ దగ్గర సమాచారముందని బ్రెన్నన్ చెప్పారు. రసాయనిక ఆయుధాలను వాడటం, తయారు చేయడంలో ఐసిస్ ఉగ్రవాదులకు సామర్థ్యం ఉందని తెలిపారు. ఇరాక్, సిరియాలో ఐసిస్ రసాయనిక ఆయుధాలను వాడినట్టు చెప్పారు. ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి అమెరికా ఇంటలిజెన్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. -
ఘర్షణల్లో 47 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్‌లో ప్రభుత్వ బలగాలకు ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్‌కు మధ్య జరిగిన పరస్పరదాడుల్లో 47 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో సామాన్య పౌరులతోపాటు కొందరు ఉగ్రవాదులు, రక్షణ బలగాల సైనికులు కూడా ఉన్నారు. గురువారం సలాలుద్దీన్, అన్బర్ అనే చోట ఈ దాడులు జరిగాయి. ఇప్పటికే పలు ప్రాంతాలను ఆక్రమించుకుంటూ వస్తున్న ఇస్లామిక్ స్టేట్ తాజాగా సలాలుద్దీన్ ప్రావిన్స్‌ను కూడా ఆక్రమించుకునే ప్రయత్నంగా అక్కడికి వచ్చాయి. అదే సమయంలో వారిని నిలువరించేందుకు అక్కడికి చేరుకున్న బలగాలు వారిపై దాడికి దిగడంతో పరస్పర తీవ్ర ఘర్షణలు నెలకొని ప్రాణనష్టం చోటుచేసుకుంది. -
71 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం
బాగ్దాద్: ఇరాక్ ఉత్తర ప్రాంతం మసూల్ పరిసర ప్రాంతాలల్లో ఐఎస్ తీవ్రవాదులే లక్ష్యంగా యూఎస్ సారధ్యంలోని అంతర్జాతీయ సంకీర్ణ దళాలు సోమవారం వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 40 మందికి పైగా ఐఎస్ తీవ్రవాదులు మరణించారు. మృతుల్లో ముగ్గురు ఐఎస్ తీవ్రవాద నాయకులు ఉన్నారని.. వారు మజ్బల్ దిబాన్ ఖాలప్, అహ్మద్ అలీ అల్ జుబొరి, బాస్మీ మహమ్మద్ అలీగా గుర్తించినట్లు ఉన్నతాధికారి మంగళవారం వెల్లడించారు. అయితే మసూల్లోని దక్షిణ ప్రాంతంలో కూడా వైమానిక దాడుల్లో మరో 31 మంది ఐఎస్ తీవ్రవాదులు మరణించారని తెలిపారు. దాంతో సోమవారం ఒక్కరోజే మరణించిన ఐఎస్ తీవ్రవాదుల సంఖ్య 71కి చేరిందని ఉన్నతాధికారి వివరించారు. -
ఆయుధగారంలో పేలుళ్లు : ఐఎస్ తీవ్రవాదులు హతం
డెమాస్కస్: సిరియా రాజధాని డెమాస్కస్‌లో ఇస్లామిక్ మిలిటెంట్స్ గ్రూప్‌నకు చెందిన ఆయుధగారంలో బుధవారం శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 25 మంది ఇస్లామిక్ తీవ్రవాదులు మరణించారు. మరో 20 మందికి పైగా మరణించారు. ఈ మేరకు సిరియాలోని బ్రిటన్‌కు చెందిన మానవహక్కుల పరిశీలకులు గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు. అయితే క్షతగాత్రుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదని పేర్కొన్నారు. డెమాస్కస్‌లోని పశ్చిమ భాగంలోని డెయిర్ అల్ జోర్ ప్రావెన్స్లో బాంబు పేలుళ్లు నిత్యకృత్యం అని మానవహక్కుల పరిశీలకులు వెల్లడించారు. -
వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష
బీరుట్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సన్నీ రాడికల్ గ్రూపు ఉగ్రవాదులు మరణశిక్ష విధించారు. రాళ్లతో కొట్టి చంపాల్సిందిగా హుకుం జారీ చేశారు. కన్న తండ్రి అంగీకారంతో అతని కళ్లేదుటే ఆమెను చంపేశారు. ఈ దుశ్చర్యను చిత్రీకరించి వీడియోను విడుదల చేశారు. ఈ ఆటవిక చర్యను సిరియాలో అమలు చేశారు. బాధితురాలు క్షమించాల్సిందిగా తన తండ్రిని వేడుకొనగా, ఆయన నిరాకరించాడు. సెంట్రల్ సిరియా ప్రావిన్స్‌లో వివాహేతర సంబంధం కారణంగా తొలిసారి ఓ మహిళకు మరణశిక్ష విధిస్తున్నట్టు ఐఎస్ ఉగ్రవాద నాయకుడు ప్రకటించాడు. ఆమె చనిపోయేవరకు రాళ్లతో కొట్టాల్సిందిగా ఆదేశించాడు. అక్కడ గుమికూడిన జనం అందరూ చూస్తుండగా ఆమెను రాళ్లతో కొట్టారు. కాగా ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అన్న విషయం నిర్ధారణ కాలేదు.