భారీ బాంబు లక్ష్యమేంటి?
వ్యాసార్ధం ఒక మీటరు, పొడవు 9 మీటర్లు.. బరువు 10,251 కిలోలు! అఫ్గాన్‌లోని నంగర్‌హర్‌లో ఐఎస్ సొరంగాలపై అమెరికా వేసిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ విశేషాలివి. అయితే ఇంత శక్తిమంతమైన బాంబును ఐఎస్ ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో లేని అఫ్గాన్‌లో ఎందుకు వేశారని యుద్ధనిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అఫ్ఘాన్‌లో ఐఎస్ ఉగ్రవాదులు 800 మందికి మించి లేరని అంటున్నారు. అంతేకాకుండా పెద్దగా ప్రభావం చూపలేని కొండగుహల ప్రాంతంలో ఆ బాంబును ఎందుకు వేశారో అర్థం కావడం లేదని అంటున్నారు. ‘మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్’(ఎంఓఏబీ)గానూ పిలిచే ఈ బాంబు అణు బాంబు కాదు.
ఇందులో 8,482 కిలోల పేలుడుపదార్థాన్ని కూర్చారు. జీపీఎస్ ఆధారిత ఎంఓఏబీ భూమికి 1.8 మీటర్ల ఎత్తులో ఉండగానే పేలిపోతుంది. దీంతో పేలుడు శక్తి నలుదిశలా విస్తరించి నష్టం ఎక్కువ కలుగుజేస్తుంది. ఇది గుహల్లోకి చొచ్చుకెళ్లేది కాదు. కొండలను తొలిచి స్థావరాలను ఏర్పాటు చేసుకునేటపుడు సూటిగా ఒకే మార్గం తవ్వరు. మార్గాలు పలు మలుపులు తిప్పుతారు. కాబట్టి నంగర్‌హర్‌లో గుహలన్నీ ధ్వంసమయ్యాయని చెప్పడానికి లేదు.
బొరియల్లో దాక్కున్న వారిపై దాడులు చేసేటపుడు గుహద్వారాలు లక్ష్యంగా బాంబులు కురిపిస్తుంటారు. అందుకే అప్పట్లో తోరాబోరా గుహల్లో బిన్ లాడెన్ ఉన్నాడని తెలిసినా అమెరికా ఈ బాంబును వాడలేదు. ఇటీవల సిరియాలోని షయరత్ ఎయిర్‌బేస్‌పై అమెరికా 59 తొమహక్ క్షిపణులను ప్రయోగించింది. వీటిలో 34 క్షిపణులను రష్యా రక్షణ వ్యవస్థ సాయంతో సిరియా కూల్చేసింది. దీంతో సిరియా, ఇరాక్‌లలోని ఐఎస్ మిలిటెంట్లను భయపెట్టడానికి అమెరికా బలప్రదర్శన కోసం ఎంఓఏబీని వేసి ఉండొచ్చని భావిస్తున్నారు.
దాడిలో 36 మంది హతం
మృతుల్లో కేరళవాసి!
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో గురువారం అమెరికా చేసిన భారీ బాంబు దాడిలో 36 మంది ఐసిస్ ఉగ్రవాదులు హతమైనట్లు అఫ్గాన్ అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక కేరళ వాసి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నంగర్‌హర్ రాష్ట్రంలోని అచిన్ జిల్లాలో అమెరికా వాయుసేన ఐసిస్ సొరంగాల సముదాయంపై వేసిన 11 టన్నుల ‘మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్’ ధాటికి పలు ఐసిస్ గుహలు, మందుగుండు సామగ్రి ధ్వంసమైంది. ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టమూ వాటిల్లేదన్నారు.
కాగా, దాడిలో తమ మిలిటెంట్లెవరూ చనిపోలేదని ఐఎస్ ప్రకటించింది. దాడి మృతుల్లో కేరళ కాసర్‌గోడ్ జిల్లా పద్నా గ్రామానికి చెందిన ఐసిస్ మిలిటెంట్ ముర్షీద్ ఉన్నట్లు తనకు టెలిగ్రామ్ ద్వారా సమాచారం అందిందని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత అబ్దుర్ రహిమాన్ తెలిపారు. కాగా, ‘మా సైన్యాన్ని చూసి గర్విస్తున్నాం. ఇది మరో విజయం. గత 8 వారాల్లో ఏం జరిగిందో చూస్తే గత ఎనిమిదేళ్ల జరిగినదానికి, ఇప్పటికి తేడా ఏమిటో తెలుస్తుంది’ అని వైట్‌హౌస్‌లో విలేకర్లతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
‘అమెరికాకు తగిన బదులిస్తాం’
ప్యాంగ్యాంగ్: అమెరికా రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలకు నిర్ధాక్షిణ్యంగా బదులిస్తామని ఉత్తరకొరియా ప్రకటించింది. అణు పరీక్షలపై ఉత్తరకొరియా ముందుకు సాగితే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడంతో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలా స్పందించింది.
కొరియా ద్వీపకల్పానికి అణు సామర్థ్యం ఉన్న విమానాలు ఎంత దగ్గరగా వస్తే అంతే కనికరం లేకుండా తామూ దాడులు చేస్తామని పేర్కొంది. కాగా, ఆరోసారి అణు పరీక్షలు చేస్తామన్న ఉత్తరకొరియా ప్రకటన పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే, ఉత్తర కొరియా అణు పరీక్షలు జరిపితే ఆ దేశంపై ఎలాంటి సైనిక చర్యలు తీసుకోవాలనే దానిపై యోచిస్తున్నామని అమెరికా ఉన్నతాధికారి తెలిపారు.