ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత సైన్యం ఏవైనా దుందుడుకు, దుస్సాహస చర్యలకు దిగితే నిర్ణయాత్మకంగా, సంపూర్ణంగా జవాబివ్వాల్సిందిగా పాకిస్తాన్ సైన్యాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారు. దాడి తర్వాత భారత సైన్యానికి ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైన్యానికి ఇమ్రాన్ ఆదేశాలివ్వడం గమనార్హం. ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా, నిఘా, ఇతర విభాగాలు అధిపతులు, భద్రతా దళాల అధికారులతో ఇమ్రాన్ జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించారు. తమ ప్రజలను రక్షించుకునే సామర్థ్యం తమకు ఉందనే విషయాన్ని అందరికీ చెప్పాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించుకుందని ఇమ్రాన్ అన్నారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ హస్తం లేదనీ, భారత్‌లోనే ఆ దాడికి కుట్ర పన్ని అమలు చేశారని పాక్ పౌర ప్రభుత్వ, సైనిక విభాగాల అత్యున్నత స్థాయి నాయకులు, అధికారులు వాదించారు.
జమాత్ ఉద్ దవాపై పాక్ నిషేధం
2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ నేతృత్వంలోని జమాత్ ఉద్ దవా ఉగ్ర సంస్థ, దాని అనుబంధ దాతృత్వ సంస్థ ఫలాహె ఇన్సానియత్‌లను పాక్ ప్రభుత్వం గురువారం నిషేధించింది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచవ్యాప్త ఒత్తిడిని తగ్గించేందుకు వీటిని నిషేధించినట్లు తెలుస్తోంది. జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ హోం శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. అన్ని నిషేధిత సంస్థలపైనా చర్యలను వేగవంతం చేయాల్సిందిగా నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment