ఇస్లామాబాద్ : పాక్ వైమానిక దాడులను తిప్పి కొట్టే క్రమంలో ఆ దేశ ఆర్మీకి చిక్కిన భారత పైలట్ అభినందన్ శుక్రవారం స్వదేశానికి రానున్నారు. ఈ క్రమంలో యావత్ భారత్ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది. అయితే అభిందనన్‌ను విడుదల చేయాలంటూ భారతీయులు సహా పాకిస్తానీయులు కూడా కోరుకున్నారని పాక్ నటుడు, ఫిల్మ్ మేకర్ జమాల్ షా అన్నాడు. ‘ మా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో నేనున్నా సరే అలాగే చేసేవాడిని. ఎందుకంటే పాకిస్తాన్‌లోని మెజారిటీ ప్రజలు భారత పైలట్‌ను విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని అతడు వ్యాఖ్యానించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం వస్తే పాక్ ప్రజల పరిస్థితి మరింత దిగజారేదని అభిప్రాయపడ్డాడు. తమ దేశంలో ఇప్పటికే 70 శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్నారని, యుద్ధం వస్తే పేదరికం మరింతగా పెరిగిపోయేదని ఆందోళన వ్యక్తం చేశాడు.(‘భారతీయ సినిమాలను నిషేధిస్తున్నాం’)
ఇక పుల్వామా ఉగ్రదాడి, సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో పాక్ నటులను భారత్ నిషేధించడం.. అదే విధంగా భారతీయ సినిమాలపై పాక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి జమాల్ మాట్లాడుతూ... ‘ కళలు, సంస్కృతి.. ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి తోడ్పడతాయి. మేము(భారత్- పాకిస్తాన్) సంగీతం, సినిమా ఇలా ఎన్నో మాధ్యమాల కారణంగా మానసికంగా ముడిపడిపోయాం. ఒకవేళ శాంతి చర్చలకు అవకాశం దొరికితే పొరుగుదేశం నటులతో మా అనుబంధం మరింత దృఢపడుతుందనే నమ్మకం ఉంది అని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో భారతీయ సినిమాలపై నిషేధం విధించడంతో పాక్ థియేటర్ల యజమానుల పరిస్థితి ఆందోళనలో పడింది. పాక్ నిర్ణయం బెడిసికొట్టడంతో పాక్ నటులు పునరాలోచనలో పడ్డట్లుగా జమాల్ మాటల ద్వారా తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడం, ఆర్థికంగా సంక్షోభం ఎదుర్కొంటున్న కారణంగా భారత్ ముందు పాక్ తలొగ్గిన సంగతి తెలిసిందే.(బ్యాన్ చేసి.. బొక్క బోర్లాపడ్డ పాక్)
Comments
Please login to add a commentAdd a comment