14 లోపు ఇమ్రాన్‌ ప్రమాణం | Imran Khan to be sworn in as Pakistan PM before Aug 14 | Sakshi
Sakshi News home page

14 లోపు ఇమ్రాన్‌ ప్రమాణం

Published Mon, Jul 30 2018 3:13 AM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

Imran Khan to be sworn in as Pakistan PM before Aug 14 - Sakshi

ఇస్లామాబాద్‌ / కరాచీ: పాకిస్తాన్‌ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14 లోపే ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పాకిస్తాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌(పీటీఐ) వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం చిన్న పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించాయి. జూలై 25న జరిగిన పాక్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ నేతృత్వంలోని పీటీఐ 116 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, మాజీ ప్రధాని షరీఫ్‌కు చెందిన పీఎంఎల్‌(ఎన్‌) 64 సీట్లు, పాక్‌ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ నేతృత్వంలోని పీపీపీకి 43 సీట్లు వచ్చాయి. 272 సీట్లున్న జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటు కోసం 172 సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీటీఐ నేత నయీనుల్‌ హక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఏర్పాటుకు జరుగుతున్న చర్చలు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. ఆగస్టు 14 లోపే ఇమ్రాన్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపడతారని వెల్లడించారు.  

మారనున్న బలాబలాలు..
పాకిస్తాన్‌ రాజ్యాంగం ప్రకారం ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు అదనంగా గెలుచుకున్న స్థానాలకు రాజీనామా చేయాలి. దీని ప్రకారం ఐదు నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించిన పీటీఐ ఇమ్రాన్‌ ఖాన్‌ నాలుగు సీట్లకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలాగే పీటీఐ నేత గులామ్‌ సర్వార్‌ ఖాన్‌ కూడా ఓ స్థానంలో రాజీనామా చేయాలి. ఇలా అన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే పాక్‌ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ పార్టీ బలం 109 సీట్లకు పడిపోతుంది. తాజాగా ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న పీటీఐ నేతలు ఎంక్యూఎం(పీ), జీడీఏ, పీఎంఎల్‌(క్యూ), బలూచిస్తాన్‌ నేషనల్‌ పార్టీ(మెంగల్‌), అవామీ నేషనల్‌ పార్టీతో పాటు 13 మంది ఇండిపెండెంట్లతో జోరుగా చర్చలు జరుపుతున్నారు. మరోవైపు కరాచీ, సియాల్‌ కోట్‌ నగరాల్లో రెండు బ్యాలెట్‌ బాక్సు లు, పలు బ్యాలెట్‌ పేపర్లు రోడ్ల పక్కన లభ్య మయ్యాయి. దీంతో ఈ ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఓడిపోయిన అభ్యర్థులు ఆందోళనకు దిగారు.

చేతులు కలపనున్న పీఎంఎల్‌–పీపీపీ
జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు పీఎంఎల్‌(ఎన్‌), పాకిస్తాన్‌ పీపు ల్స్‌ పార్టీ(పీపీపీ) చేతులు కలిపే అవకాశముందని స్థానిక మీడియా తెలిపింది. ఇందులోభాగంగా రెండు పార్టీలు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చాయనీ, త్వరలోనే నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించింది.

దిగజారిన షరీఫ్‌ ఆరోగ్యం
ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైలులో పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఆరోగ్యం దిగజారింది. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో వెంటనే జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(పీఐఎంఎస్‌)కు తరలించాలని పంజాబ్‌ ప్రావిన్సు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అధికారులు వెంటనే నవాజ్‌ షరీఫ్‌ను ఆస్పత్రికి తరలించారు. షరీఫ్‌ శరీరంలో రక్తప్రసరణ తగ్గిపోవడంతో పాటు అక్కడక్కడా రక్తం గడ్డకట్టిందని వైద్యులు ప్రభుత్వానికి తెలిపారు. ఆయన గుండె స్పందన కూడా సరిగా లేదని వెల్లడించారు. దీంతో ఉన్నతస్థాయి ఖైదీల కోసం పీఐఎంఎస్‌లో ప్రత్యేకంగా రూపొందించిన విభాగంలో షరీఫ్‌కు చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement