
ఇస్లామాబాద్ : అమెరికాపై భీకర దాడుల సూత్రధారి, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడని సంబోధించడం పట్ల విపక్షం మాజీ క్రికెటర్‌పై విరుచుకుపడింది. ఇమ్రాన్ గురువారం పాక్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ 2011లో అమెరికన్ దళాలు పాక్ నగరం అబాట్టాబాద్‌లోని లాడెన్ స్ధావరంపై దాడిచేసి ఆయనను మట్టుబెట్టిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికన్ హెలికాఫ్టర్లు లాడెన్ స్ధావరంపై దాడికి తెగబడిన ఆపరేషన్ గురించి పాకిస్తాన్‌కు తెలియదని, అమెరికన్ దళాలు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చి అమరుడిని చేయడం పట్ల పాకిస్తానీలుగా మనం ఎంత ఇబ్బందులకు గురయ్యామో తాను ఎన్నటికీ మరవలేనని చెప్పుకొచ్చారు.
కాగా ఇమ్రాన్ వ్యాఖ్యలను విపక్ష నేత, మాజీ విదేశాంగ మంత్రి ఖ్వాజా అసిఫ్ తప్పుపట్టారు. కరుడుగట్టిన ఉగ్రవాదిని అమరుడిగా ఇమ్రాన్ ఖాన్ కొనియాడారని వ్యాఖ్యానించారు. బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన సమయంలో అధికారంలో ఉన్న పీపీపీ నేత బిలావల్ బుట్టో జర్ధారి సైతం ఇమ్రాన్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హింసాత్మక అతివాదాన్ని ప్రధాని సమర్ధిస్తున్నారని దుయ్యబట్టారు. చదవండి : ఇమ్రాన్ ముందు అనేక సవాళ్లు
Comments
Please login to add a commentAdd a comment