కోడింగ్ తో హద్దులను అధిగమించింది..!
పశ్చిమాఫ్రికాకు చెందిన యౌమా.. తన చిన్ననాటి కలను కోడింగ్ తో సాకారం చేసుకుంది. సెనెగల్ లో మహిళల పట్ల చూపించే వివక్ష, వారికి విధించే హద్దులను అధిగమించింది. పెన్నులు, పెన్సిళ్ళు సైతం కొనుగోలు చేయలేని అనేకమంది విద్యార్థులకు పుస్తకాల అవసరమే లేకుండా కొత్త మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టింది.
తన ఆలోచనను అమల్లోకి తెచ్చిన యౌమా.. స్థానిక వొలాఫ్ భాషలో మొబైల్ ఫోన్ అప్లికేషన్ 'వెక్కియో'.. ను రూపొందించింది. టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు పుస్తకాల కష్టం నుంచీ మార్పును తెస్తోంది. ప్రత్యేక కార్యక్రమం ద్వారా సెనెగల్ లోని యువతులను కోడింగ్, టెక్నాలజీల్లో ప్రోత్సాహాన్ని కూడా అందిస్తోంది. తాను రూపొందించిన కొత్త యాప్ విద్యార్థులకు పుస్తకాల కష్టాన్ని దూరం చేస్తుందని ఆశిస్తున్నట్లు సెనెగల్ కు చెందిన 24 ఏళ్ళ డిజైనింగ్ ఇంజనీర్ యౌమా ఫాల్ చెప్తోంది.
సంస్కృతీ సంప్రదాయాలు, లింగ వివక్ష అధికంగా కనిపించే ముస్లిం కమ్యూనిటీ విరాజిల్లుతున్నపశ్చిమ ఆఫ్రికా దేశంలో యౌమాతోపాటు కొందరు యువతులు తమ నైపుణ్యాన్ని వినియోగించి.. సరిహద్దులను చెరిపేస్తున్నారు. సెనెగల్ లో ఆన్ లైన్ జీవితానికి మొబైల్ ఫోన్లు కేంద్ర బిందువులు. అక్కడ దాదాపు 95 శాతం ఇంటర్నెట్ కనెక్షన్లు మొబైల్ ఫోన్లద్వారానే వినియోగిస్తున్నట్లు సెనెగల్ పోస్ట్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్ రెగ్యులేషన్ అథారిటీ లెక్కలను బట్టి తెలుస్తోంది. అయితే అక్కడి యువతుల్లో 30 శాతం కంటే తక్కువమంది యువతులు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటున్నట్లు నిపుణుల ద్వారా తెలుస్తోంది. ఈ పరిస్థితిని అధిగమిస్తూ సాంకేతిక, కోడింగ్ లలో యువతులను ప్రోత్సహిస్తూ ఫాల్.. కొత్త ఒరవడిని సృష్టించింది.