
ఇస్లామాబాద్: భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు భారత్–పాక్‌ల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతుందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. భారత్ మరో దుస్సాహసానికి ఒడిగడుతుందేమోనని తాను భావిస్తున్నానన్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న పాక్‌లోని బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రస్థావరంపై భారతవాయుసేన దాడి చేయడం తెల్సిందే. ‘ప్రమాదం ఇంకా ముగియలేదు. భారత్‌లో ఎన్నికలు ముగిసేవరకు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంటుంది. ఇండియా దాడి చేస్తే ప్రతిఘటనకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ఇమ్రాన్ అన్నట్లు డాన్ పత్రిక వెల్లడించింది.
చికిత్స కోసం
షరీఫ్‌కు బెయిలు
అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు పాకిస్తాన్ సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. అల్ అజీజియా ఉక్కు మిల్లు లంచం కేసులో షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడగా గతేడాది డిసెంబర్ నుంచి ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఆరోగ్యం బాగా లేదనీ, చికిత్స కోసం బెయిలు మంజూరు చేయాలంటూ షరీఫ్ చేసిన విజ్ఞప్తిని గతంలో ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించింది.