భారతదేశమే మాకు అతిపెద్ద శత్రువు!
తమ దేశానికి అతిపెద్ద శత్రువు ఉగ్రవాదం కాదని.. భారతదేశమేనని పాక్ అంటోంది. భారతదేశం తన అణ్వస్త్ర నిల్వలను తగ్గించుకుంటే గానీ.. పాకిస్థాన్ ఆయుధ సేకరణ తగ్గించబోదని చెబుతోంది. ఇలా అన్నది ఎవరో కాదు.. సాక్షాత్తు పాక్ ప్రధానమంత్రికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్! అణ్వస్త్ర నిల్వలను తగ్గించుకోవాలంటూ అమెరికా మంత్రి జాన్ కెర్రీ చేసిన సూచనకు సమాధానంగా ఆయనీమాట చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నిల్వలను తగ్గించుకోవాల్సింది భారతదేశమే గానీ పాకిస్థాన్ కాదని ఆయన అన్నారు. వాళ్లు నిల్వలు పెంచుకుంటూ పోతే.. తాము తగ్గించుకోలేమని ఆయన చెప్పారు.
అణ్వస్త్రాలను తగ్గించుకోవాలన్నదాన్ని విధాన నిర్ణయంగా తీసుకోవాలని జాన్ కెర్రీ పాకిస్థాన్‌కు సూచించారు. అయితే, భారతదేశాన్ని కూడా అలా అడుగుతామా, లేదా అన్న విషయాన్ని మాత్రం కెర్రీ ఎక్కడా ప్రస్తావించలేదు. భద్రతాపరంగా తమ ఆందోళనను అర్థం చేసుకోవాలని సర్తాజ్ అజీజ్ అమెరికాను కోరారు. భారత్ తన అణ్వస్త్రాలను ఎప్పటికప్పుడు ఆధునికీకరించుకుంటోందని, అందువల్ల పాకిస్థాన్ కూడా స్పందించాల్సి వస్తోందని ఆయన అన్నారు. అమెరికా - పాకిస్థాన్‌ల మధ్య వ్యూహాత్మక చర్చలలో పాల్గొనేందుకు వెళ్లిన సర్తాజ్ అజీజ్.. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు.