ఉగ్రవాదానికి ప్రధాన బాధితులం మేమే
ఉగ్రవాదానికి ప్రధాన బాధితులం మేమే
Published Wed, Oct 26 2016 4:21 PM | Last Updated on Mon, Sep 4 2017 6:23 PM
తీవ్రవాదులకు ఆశ్రయం కల్పించవద్దంటూ ఎన్నిసార్లు భారత్ హెచ్చరించినా.. పెడచెవిని పెట్టిన పాకిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని పోలీసు శిక్షణ కేంద్రంపై నిన్న జరిగిన ఉగ్ర దాడితో కళ్లుతెరిచింది. ఉగ్రవాద కార్యకలాపాలకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్, తీవ్రవాదానికి ప్రధాన బాధితులం తామేనని వాపోతుంది. దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా ఉగ్రవాదం ప్రబలుతుందని పాకిస్తాన్ ప్రధానమంత్రికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. ఇస్తామాబాద్లో జరిగిన యునిటెడ్ నేషన్స్ సెక్యురిటీ కౌన్సిల్ కౌంటర్-టెర్రరిజం కమిటీ సమావేశంలో భౌగోళిక రాజకీయ పరిణామాలను ఆయన గుర్తుచేసుకున్నారు.
గత దశాబ్దాలుగా టెర్రరిజం ప్రబలడానికి ముఖ్య కారణంగా భౌగోళిక-రాజకీయ పరిణామాలే కారణమని సర్తాజ్ అజీజ్ ఎత్తిచూపారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ కమ్యూనిటీ చేస్తున్న పోరాటంలో పాకిస్తాన్ ముందంజలో ఉందని, నేషనల్ యాక్షన్ ప్లాన్కు ఆదేశాలతో పాకిస్తాన్ కౌంటర్ టెర్రరిజం అమలుచేస్తుందని సర్తాజ్ అజీజ్ వివరించారు. గ్లోబల్ కౌంటర్ టెర్రరిజంలో పాకిస్తాన్ ఎన్నో త్యాగాలు చేసిందని ఆయన అన్నారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలోని ఓ పోలీస్ శిక్షణా కేంద్రంపై మారణాయుధాలతో విరుచుకుపడిన ఉగ్రవాద ఘటనలో 61 మంది యువ క్యాడెట్లు మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో ఉగ్రవాదులు పాల్పడిన అతి భీకర దాడుల్లో ఇది ఒకటని అధికారులు పేర్కొన్నారు.
Advertisement