పాక్ ప్రధానితో మోదీ భేటీ?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య త్వరలోనే ఓ సమావేశం జరిగే అవకాశం ఉందని పాకిస్తానీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ సైనిక కోర్టు మరణశిక్ష విధించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇరు దేశాల ప్రధానుల మధ్య భేటీ ఎలా సాధ్యమన్న అనుమానాలున్నా, జూన్ నెలలో జరగనున్న షాంఘై సహకార సమితి (ఎస్‌సీఓ) సమావేశాల సమయంలోనే వీరిద్దరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సమావేశం కజకిస్థాన్‌లోని అస్తానాలో జరగాల్సి ఉంది.
ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు కుల్‌భూషణ్ యాదవ్ ఘటన కారణంగా దెబ్బ తినకూడదని పాక్ భావిస్తోందని ఆ దేశ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. భారతదేశంతో సత్సంబంధాలు ఉండాలన్నదే తమ విధానమని పాక్ రక్షణ విశ్లేషకుడు, రిటైర్డ్ పాక్ ఆర్మీ అధికారి తలత్ మసూద్ అన్నారు. ఎస్‌సీఓలో ఉన్న ప్రభావవంతమైన దేశాలు పాకిస్తాన్ మీద ఒత్తిడి తెస్తున్నాయి. భారతదేశంతో సత్సంబంధాలు కలిగి ఉండాలని చెబుతున్నాయి. అందుకే పాక్ నుంచి ఇలాంటి సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమిలో రష్యా, చైనా, మధ్య ఆసియా దేశాలు, భారత్, పాకిస్తాన్ ఉన్నాయి. సంస్థ ప్రయోజనాలను కాపాడటంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలు కూడా మెరుగుపరుచుకుంటామన్న నిబంధనతోనే ఈ దేశాలకు అవకాశం ఇచ్చినట్లు చెబుతున్నారు.