జెనీవా : జమ్ము కశ్మీర్‌లో సీనియర్ జర్నలిస్టు షుజత్ బుఖారి, ఆర్మీ జవాన్ ఔరంగజేబ్‌ల హత్యను భారత్ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రస్తావించింది. కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసింది.సరిహద్దు ఉగ్రవాదమే ప్రజల గొంతుకను తొక్కిపెడుతోందని, గత వారం సీనియర్ జర్నలిస్టు సహా భద్రతా అధికారులు, జవాన్‌ను ఉగ్ర మూకలు పొట్టనపెట్టుకున్నాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ కే చందర్ స్పష్టం చేశారు.
కాగా కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, వీటిపై అంతర్జాతీయ విచారణ చేపట్టాలని ఐక్యరాజ్యసమితి గతవారం ఓ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ నివేదిక అసత్యాలతో దురుద్దేశపూరితంగా రూపొందిందని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ధ్రువీకరించని సమాచారంతో ఈ నివేదికను వెల్లడించడం వెనుక ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ ఉద్దేశాన్ని ప్రశ్నించింది.
Comments
Please login to add a commentAdd a comment