భారత సంతతి విద్యార్థికి నేషనల్ జాగ్రఫిక్ అవార్డు
వాషింగ్టన్: అమెరికాలో అఖిల్ రేకులపల్లి (13) అనే భారత సంతతికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి ప్రతిష్టాత్మకమైన నేషనల్ జాగ్రఫిక్ పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారం కింద 50వేల డాలర్ల స్కాలర్‌షిప్ కూడా లభించింది. వర్జీనియాలో నివసించే అఖిల్ నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ నిర్వహించిన జాతీయస్థాయి క్విజ్ పోటీలో మరో భారత సంతతి విద్యార్థి అమేయ మజుందార్‌ను ఓడించి ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు. బుధవారం వాషింగ్టన్‌లో జరిగిన చివరి రౌండ్‌లో పదిమంది విద్యార్థులు పాల్గొన్నారు.
అమెరికా వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో జరిగిన పోటీలో సుమారు 40 లక్షలమంది విద్యార్థులు పాల్గొన్నట్టు నేషనల్ జాగ్రఫిక్ సంస్థ తెలిపింది. వివిధ వార్తాచానళ్లను చూడడం ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నానని, పోటీలో గెలవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడిందని అఖిల్ చెప్పాడు. ఈ పోటీకోసం అఖిల్ ఓ కోచ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కాగా, రెండో స్థానంలో నిలిచిన 11 ఏళ్ల అమేయ మజుందార్‌కు 25 డాలర్ల స్కాలర్‌షిప్ లభించింది.