మాకివే ఒలింపిక్స్‌; కచ్చితంగా గెలవాలి!! | Indian Americans Dominate In National Spelling Bee | Sakshi
Sakshi News home page

మాకివే ఒలింపిక్స్‌; కచ్చితంగా గెలవాలి!!

Published Mon, Jun 3 2019 11:25 AM | Last Updated on Mon, Jun 3 2019 12:08 PM

Indian Americans Dominate In National Spelling Bee - Sakshi

ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తమ ఉనికిని చాటుకోవడంలో భారతీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్న ఎన్నారైలు తమ పిల్లలను కూడా అగ్రపథంలో నిలపడంలో విజయం సాధిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో గత దశాబ్దకాలంగా అమెరికాలోని భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడమే ఇందుకు నిదర్శనం. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను వెనక్కినెట్టి మరీ మన చిన్నారులే విజేతలుగా నిలుస్తూ.. భారత మేథా స్థాయిని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. కఠిన పదాల ఉచ్ఛారణను అనుసరించి వాటి స్పెల్లింగ్‌ చెప్పడం ఈ పోటీ ప్రధాన లక్షణం.

మొదటి విన్నర్‌ ఫ్రాంక్‌..
స్పెల్లింగ్‌ బీ అనే పదం 1875లో మొదటిసారిగా అచ్చయింది. విద్యార్థుల్లో పోటీతత్త్వాన్ని పెంచేందుకు ద కొరియర్‌ జర్నల్‌ అనే వార్తా పత్రిక 1925లో యునైటెడ్‌ స్టేట్స్‌ స్పెల్లింగ్‌ బీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. వాషింగ్టన్‌లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ పోటీలో ఫ్రాంక్‌ నౌహసర్‌ అనే పదకొండేళ్ల పిల్లాడు తొలి విజేతగా చరిత్రకెక్కాడు. గ్లాడియస్‌(లాటిన్‌లో ఖడ్గం అని అర్థం) అనే పదానికి సరైన స్పెల్లింగ్‌ చెప్పి ట్రోఫీని అందుకున్నాడు. అమెరికాలోని కెంటెకీలో జన్మించిన ఫ్రాంక్‌ తదనంతర కాలంలో అమెరికన్‌ పేటెంట్‌ లాయర్‌గా ప్రత్యేక గుర్తింపు పొందారు. జర్మన్‌ సంతతికి చెందిన ఆయన మార్చి 11, 2011లో మరణించారు.

ఆ డాక్యుమెంటరీ స్ఫూర్తిగా..
1941లో స్క్రిప్స్‌ హవార్డ్‌ న్యూస్‌ సర్వీస్‌ స్పెల్లింగ్‌ బీ స్పాన్సర్‌షిప్‌ బాధ్యతలు చేపట్టింది.  అప్పటినుంచి ఈ పోటీని ‘స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ’ గా వ్యవహరిస్తున్నారు. ప్రతీ ఏటా విధిగా నిర్వహించే ఈ పోటీల్లో 2008 నుంచి భారత సంతతి విద్యార్థులే విజేతలుగా నిలవడం విశేషం. ఇండియానాకు చెందిన సమీర్‌ మిశ్రా స్పెల్లింగ్‌ బీ-2008 ట్రోఫీ సాధించాడు. అయితే భారతీయులకు స్పెల్లింగ్‌ బీపై మక్కువ ఏర్పడింది మాత్రం స్పెల్‌బౌండ్‌ అనే డాక్యుమెంటరీతోనే అంటారు ఆంత్రపాలజిస్టులు. 1999 నేషనల్‌ బీ పోటీలో గెలుపొందిన నుపుర్‌ లాలా విజయగాథ ఇండో అమెరికన్లకు స్ఫూర్తినిచ్చిందని పేర్కొంటున్నారు.


సమీర్‌ మిశ్రా

భారతీయుల్లో పోటీ తత్త్వం మెండు..
‘ వలసదారులుగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ.. మాతృభాషతో పాటు ఇతర భాషలపై పట్టు సాధించాలనే ఆసక్తి భారతీయుల్లో మెండుగా ఉంటుంది. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ విభాగాల్లో అగ్రపథాన నిలిచే ఇండో అమెరికన్లలో చాలా మంది స్పెల్లింగ్‌ బీని ఎంతో ప్రతిష్టాత్మంగా భావిస్తారు. తమ పిల్లలను ఈ పోటీల్లో భాగస్వామ్యం చేయడాన్ని గర్వంగా ఫీలవుతారు. అంతేకాదు స్పెల్‌ బీ పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచిన విద్యార్థులు ఇతర అంతర్జాతీయ స్పెల్లింగ్‌ పోటీల్లోనూ విజేతలుగా నిలుస్తున్నారు.

ఫౌండేషన్‌ సహకారంతో..
నార్త్‌ సౌత్‌ ఫౌండేషన్‌ అనే నాన్‌ ప్రాఫిట్‌ సంస్థ 1993 నుంచి భారత సంతతి విద్యార్థులకు.. స్పెల్లింగ్‌, వొకాబులరీ, భూగోళశాస్త్రం, గణితం తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తోంది. దాదాపు 92 దేశాలకు చెందిన పదాలు, వాటి చరిత్రకు సంబంధించిన వివరాలు సహా ఇందులో భాగంగా ఉంటాయి. వివిధ దేశాలకు చెందిన సుమారు 16 వేల మంది విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలో ఇండో అమెరికన్లే ఛాంపియన్లుగా నిలవడంలో ఈ సంస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.  ఎటువంటి లాభాపేక్ష, పబ్లిసిటీ లేకుండా విద్యార్థులకు తన వంతు సహాయం చేస్తోంది.

వారి పాత్ర అభినందనీయం
అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ స్పెల్లింగ్‌ పోటీలో భారత సంతతి విద్యార్థులు విజేతలుగా నిలవడంలో వారి తల్లిదండ్రులదే కీలక పాత్ర అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ పోటీ కోసం ప్రత్యేకంగా కోచ్‌లను నియమించడం, వారే స్వయంగా పిల్లల కోసం సమయం కేటాయించడం ద్వారా పదేళ్లుగా ఈ విన్నింగ్‌ రికార్డును కొనసాగించడం సాధ్యమవుతోంది. ఇండో అమెరికన్ల పోటీతత్త్వం, వారి విజయం వెనుక రహస్యాల గురించిన పలు విషయాల గురించి బ్రేకింగ్‌ ద బీ అనే డాక్యుమెంటరీలో తల్లిందండ్రుల పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ప్రత్యేకంగా కోచింగ్‌ సెంటర్లు..
స్పెల్లింగ్‌ బీ పోటీలో దాదాపు శౌరవ్‌ దాసరి అనే ఇండో అమెరికన్‌ గత పదేళ్లుగా విసుగు చెందక పాల్గొంటూనే ఉన్నాడు. శౌరవ్‌తో పాటు అతడి సోదరిని కూడా ఈ పోటీలో భాగస్వామ్యం చేయడం గురించి వారి తండ్రి గణేష్‌ మాట్లాడుతూ.. ‘  విద్య ప్రాధాన్యత తెలిసిన తల్లిదండ్రుల నుంచే పిల్లలు స్ఫూర్తి పొందుతారు. నేను, నా భార్య ఉష సాంకేతిక రంగంలో పట్టా పొందిన మేము నిపుణుల కోటా కింద వీసా సంపాదించి ఇక్కడకు వచ్చాం. 2017లో మా పిల్లలకు స్పెల్‌ బీ వయోపరిమితి ముగిసింది. ఆ తర్వాత స్పెల్‌పండిట్‌ అనే కోచింగ్‌ కంపెనీ ప్రారంభించి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం’  అని పేర్కొన్నారు.


నుపుర్‌ లాలా

2025 నాటికే మనదే హవా
ఇక డల్లాస్‌కు చెందిన విజయ్‌ రెడ్డి తన కొడుకును చాంపియన్‌గా తీర్చిదిద్దేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. ఈ విషయంలో ఆయన భార్య కూడా తన వంతు సహాయం చేస్తున్నారు. అయితే వారి కుమారుడు చేతన్‌ ఏడోస్థానంలోనే నిలిచినప్పటికీ అతడిని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఇది మాకు ఒలంపిక్స్‌ వంటిది. తను కచ్చితంగా గెలవాలని మా ఆశ అని చెప్పే విజయ్‌రెడ్డి ప్రతీ అంశాన్ని చాలెంజింగ్‌గా తీసుకుంటారు. అందుకే స్పెల్‌బీ విద్యార్థుల కోసం జియోస్పెల్‌ అనే కోచింగ్‌ సెంటర్‌ను ప్రారంభించి మెరికల్లా వారిని తీర్చిదిద్దుతున్నారు’  అని ఆంత్రపాలజిస్ట్‌ షాలినీ శంకర్‌ పేర్కొన్నారు. 2025 నాటికి స్పెల్లింగ్‌ బీలో పూర్తి స్థాయిలో భారతీయుల హవానే కొనసాగడం ఖాయమని అభిప్రాయపడ్డారు.

కాగా తాజాగా జరిగిన స్పెల్లింగ్‌ పోటీల్లో భారత సంతతి విద్యార్థులు చాంపియన్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియాకు చెందిన రిషిక్‌ గంధశ్రీ(13), మేరీల్యాండ్‌కు చెందిన సాకేత్‌ సుందర్‌(13), న్యూజెర్సీకి చెందిన శ్రుతికా పధి (13), టెక్సాస్‌కు చెందిన సోహుం సుఖ్తంకర్‌ (13), అభిజయ్‌ కొడాలి(12), రోహన్‌ రాజా (13), క్రిస్టఫర్‌ సెర్రావ్‌(13), అలబామాకు చెందిన ఎరిన్‌ హొవార్డ్‌(14)లు విజేతల జాబితాలో ఉన్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాలు, కెనడా, ఘనా, జమైకా తదితర దేశాల నుంచి వచ్చిన దాదాపు 562 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా, 8 మందిని నిర్ణేతలు విజేతలుగా ప్రకటించారు. అందులో ఇద్దరు అమ్మాయిలు, ఆరుగురు అబ్బాయిలు ఉన్నారు. కాగా ఇద్దరి కన్నా ఎక్కువ మందిని విజేతలుగా ప్రకటించడం 94 ఏళ్ల స్పెల్‌బీ చరిత్రలో ఇదే తొలిసారి. వీరిలో ఒక్కొక్కరు దాదాపు రూ.35 లక్షల చొప్పున నగదును, బహుమతులను గెలుచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement